నిత్యం ప్రవహించే నదీ జలాలు స్వచ్ఛంగా ఉంటాయి. వర్షాలు పడి.. వరదలు వచ్చినప్పుడు మాత్రం కొంత కలుషితంగా మారినా.. కొంతకాలానికే వాటి సహజత్వాన్ని తిరిగి సంతరించుకుంటాయి. ఇక్కడ మాత్రం నీళ్లు ఏకంగా ముదురు ఆకుపచ్చ రంగులోకి మారిపోయాయి. కొలనుల్లో, బావుల్లో పట్టే నాచు(moss)ను తలపించేలా.. కృష్ణానదిలోనూ హరిత వర్ణం(Krishna Water in green colour) ఆవిష్కృతమైంది. ఇలాంటి ఆశ్చర్యకర పరిణామాలు ఏర్పడటం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
దృశ్యాలు వైరల్..
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి సమీపంలోని కోతిగుండు వద్ద శ్రీశైలం తిరుగు జలాల్లో నీరు ఆకుపచ్చ రంగులోకి మారిపోయింది. చుట్టూ.. హరిత వర్ణం పరుచుకున్న కొండల ప్రతిబింబం నీటిలో పడుతూ.. ఇలా కనిపిస్తోందా..? అనుకుంటే పొరపాటే. జలాలే పూర్తిగా ఆకుపచ్చగా మారిపోయి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. చేపల వేట కోసం వెళ్లిన మత్స్యకారులు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆశ్చర్యం కలిగిస్తోన్న ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
అది సాధారణమే..
జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల సహాయ ఆచార్యుడు వృక్ష శాస్త్ర విభాగ అధిపతి సదాశివయ్య దృష్టికి ఈ విషయాన్ని తీసుకురాగా.. నీరు నిలువ ఉన్న చోట అది సాధారణమేనని తెలిపారు. ఉల్ఫీయా గ్లోబోసా అనే శాస్త్రీయ నామం గల ఈ అతిచిన్న ఆవృతబీజపు మొక్క.. నిలువ ఉన్న నీటి అవాసాలలో పెరుగుతూ ఉంటుందని వివరించారు. ఇది అనేక జలచరాలకు ఆహారంగా కూడా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ మొక్కలో 40 శాతం ప్రోటీన్ ఉంటుందన్నారు. అనేక దేశాల్లో దీనిని ఆహారంగా కూడా ఉపయోగిస్తారని వెల్లడించారు.
ఇదీ చూడండి: