నాగర్కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం రాచాలపల్లి, మాదారం సమీపంలో కేఎల్ఐ కాల్వకు గండిపడింది. కాల్వ నీరు వృథాగా పోకూడదని ఇటీవలే రైతులు యంత్రాలతో మరమ్మత్తులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. కృష్ణా జలాలు ముంచెత్తి చేతికంది వచ్చిన పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఫలితం లేదని ఆవేదన వెలిబుచ్చారు. కాల్వ పూర్తిగా దెబ్బతినకముందే మరమ్మతులు చేపట్టాలని మాదారం, రాచాలపల్లి గ్రామాల రైతులు కోరుతున్నారు.
నాసిరకం పనులు..
కల్వకుర్తి మండలం కుర్మిద్ద సమీపంలో కాల్వలకు గండ్లు పడ్డాయి. పనులు నాసిరకంగా చేయడం వల్ల వీటికి గండ్లు పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. రాచాలపల్లి గ్రామం నుంచి మాదారం వెళ్లే మార్గంలో రాకపోకలకు గతంలో పైపులు వేసి దారిని ఏర్పాటు చేశారు. తరువాత ఇటీవలే వంతెన పనులు కూడా పూర్తి చేశారు. గతంలో ఏర్పాటు చేసిన పైపులను తొలగించడం మరిచిపోవడం వల్ల పైపుల వద్ద కృష్ణా జలాలు ఆగిపోవడం వల్ల సమీపంలో కాల్వలకు గండ్లు పడుతున్నాయి. కాల్వకు అడ్డంగా ఉన్న పైపులను తొలగిస్తే తప్ప ప్రయోజనం ఉండదని రైతులు అంటున్నారు.
ఆనందించాలా? బాధపడాలా?
కాల్వకు అక్కడక్కడ గండ్లు పడి వందల ఎకరాలు నీటిలో మునిగిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. కృష్ణా జలాలు వచ్చాయని ఆనందించాలో.. చేతికంది వచ్చిన పంటలు అవే జలాల్లో మునుగుతున్నాయని బాధపడాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేఎల్ఐ కాల్వ ద్వారా వస్తున్న నీరు చివరి ఆయకట్టు వరకు చేరడం కష్టంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీరు ఎక్కువగా వచ్చి పంటలు నష్టపోయిన వారు కొందరైతే, పంటలకు నీరందక ఎండిపోయే పరిస్థితి ఎదురవుతోందని మరికొందరు అంటున్నారు. కాల్వ గండ్లపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నీటి ప్రవాహం ఉన్న కాల్వలను పరిశీలించి మట్టి కట్టలను సరిచేయాలని, ఉద్దేశపూర్వకంగా గండ్లు చేసేవారుంటే గుర్తించి అలా చేసేవారిని అడ్డుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఇవీచూడండి: విహారయాత్రకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి