పేద, సామాన్య ప్రజలకు కంటి చూపును ప్రసాదిస్తూ రాష్ట్రాన్ని అంధత్వ రహిత తెలంగాణగా మార్చాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. ఇందులో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గత సంవత్సరం పట్టణాలు, గ్రామాల్లో కంటి వైద్య శిబిరాలను నిర్వహించారు. కంటి సంబంధ వ్యాధులు ఉన్న వారికి మందులు, కొందరికి కళ్లజోళ్లు పంపిణీ చేశారు. వ్యాధి తీవ్రత ఉండి, కంటి చూపు మందగించిన వారికి శస్త్రచికిత్సలు చేయాలని నిర్ణయించి వారిని గుర్తించారు. ఇందులో కొందరికి మాత్రమే శస్త్ర చికిత్సలు నిర్వహించారు. మిగిలిన వారికి ఎలాంటి శస్త్రచికిత్సలను నిర్వహించలేదు. ఎప్పుడు నిర్వహిస్తారు అన్న విషయాన్నీ అధికారులు ఇంతవరకు తెలియజేయలేదు. చూపు మందగించి కంటి వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు శస్త్రచికిత్సల కోసం ఎదురుచూస్తున్నారు.
5,15,980 మందికి కంటి పరీక్షలు
జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల్లోని 453 గ్రామపంచాయతీలు, నాలుగు పురపాలక సంఘాల్లో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గతేడాది ఆగస్లు నుంచి ఈ సంవత్సరం జనవరి 31 వరకు కంటివెలుగు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమం కింద గ్రామాలు, పట్టణాల్లో కలిపి 250కు పైగా కంటి శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాల్లో జిల్లావ్యాప్తంగా 5,15,980 మంది కళ్లను వైద్య సిబ్బంది పరీక్షించారు. ఇందులో 55,122 మందికి దగ్గరి చూపులోపం ఉన్నట్లు గుర్తించి వారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. అదేవిధంగా 44,538 మందికి దూరపు చూపు లోపం ఉన్నట్లు గుర్తించి అందులో 42,500 మందికి అద్దాలు అందజేశారు. మరో 2,038 మందికి పంపిణీ చేయాల్సి ఉంది.
19,846 మందికి శస్త్ర చికిత్సలు చేయలేరు
అదేవిధంగా జిల్లాలో 21,846 మంది కంటి వ్యాధిగ్రస్థులకు శస్త్ర చికిత్సలు అవసరమని కంటి వైద్య నిపుణులు నిర్ధారించారు. వీరిలో ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో 2 వేల మందికి శస్త్ర చికిత్సలు చేయించారు. మిగిలిన 19,846 మందికి కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించలేదు. వీరు కంటి శస్త్రచికిత్సల కోసం ఎదురుచూస్తున్నారు. వీటి కోసం అధికారులను సంప్రదిస్తే ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదని వాపోతున్నారు. ఎప్పుడు శస్త్రచికిత్సలు చేస్తారో తెలియక నెలల తరబడిగా నిరీక్షిస్తున్నామని కంటి వ్యాధిగ్రస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తూ చూపును ప్రసాదించాలని వారు కోరుతున్నారు.
శస్త్రచికిత్సలు చేయిస్తాం...
జిల్లాలో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమంలో 5,15,980 మందికి కంటి పరీక్షలు నిర్వహించాం. ఇందులో అవసరమైన వారికి కళ్లజోళ్లను పంపిణీ చేయడంతో పాటు 21,846 మందికి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించాం. ఇందులో 2 వేల మందికి శస్త్రచికిత్సలు చేయించాం. మిగిలిన వారికి శస్త్రచికిత్సలు చేయించి కంటిచూపును ప్రసాదిస్తాం.
ఇవీ చూడండి: నేడే కేబినెట్ సమావేశం