నాగర్ కర్నూల్ జిల్లా(Nagar Kurnool District) వెల్దండ మండలం చొక్కనపల్లి గ్రామసమీపంలో కల్వకుర్తి (kalwakurthy lift irrigation) ఎత్తిపోతల పథకంలో భాగమైన... డీ-82 కాల్వకు గండి(canal leakage) పండింది. అర్ధరాత్రి కాల్వ తెగడంతో దిగువన ఉన్న సుమారు 100 ఎకరాలు నీట మునిగాయి. ఆ ప్రాంతంలో రైతులు వేసుకున్న వరి, వేరుశనగ, పత్తి సహా ఇతర పంటలు నీటి పాలయ్యాయి. కాల్వ మధ్యలో రహదారి కోసం కట్ట నిర్మాణం చేయడంతో నీటి ఒత్తిడి అధికమై కట్ట కోతకు గురైందని స్థానికులు తెలిపారు.
గత ఏడాది ఇదే ప్రాంతంలో కట్ట తెగిపోవడంతో రైతులే విరాళాలు వేసుకుని మరమ్మతులు చేపట్టారు. 15 రోజుల కిందట ప్రస్తుతం తెగిన ప్రాంతానికంటే కిలోమీటర్ ముందు కాల్వ తెగిపోయింది. ఆ సమయంలో సుమారు 200 ఎకరాల పంటను నష్టపోవాల్సివచ్చిందని రైతులు వాపోయారు. కేఎల్ఐ కింద డీ-82 కాల్వ పలుమార్లు తెగిపోతున్నా పట్టించుకునే నాధుడే లేడని రైతులు వాపోతున్నారు. అధికారులు, గుత్తేదారు నాసిరకం నిర్మాణం వల్లే పదేపదే కాల్వలకు గండి పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా సమస్య తీవ్రమవుతోందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు చేపట్టి రైతులకు అండగా నిలవాలని కోరుతున్నారు.
నాసిరకం పనులు..
కల్వకుర్తి మండలం కుర్మిద్ద సమీపంలో కాల్వలకు గతంలో పలుమార్లు గండ్లు పడ్డాయి. రాచాలపల్లి గ్రామం నుంచి మాదారం వెళ్లే మార్గంలో రాకపోకలకు గతంలో పైపులు వేసి దారిని ఏర్పాటు చేశారు. తరువాత ఇటీవలే వంతెన పనులు కూడా పూర్తి చేశారు. గతంలో ఏర్పాటు చేసిన పైపులను తొలగించడం మరిచిపోయారు. ఫలితంగా పైపుల వద్ద కృష్ణా జలాలు ఆగిపోవడం వల్ల సమీపంలో కాల్వలకు గండ్లు పడుతున్నాయి. కాల్వకు అడ్డంగా ఉన్న పైపులను తొలగిస్తే తప్ప ప్రయోజనం ఉండదని రైతులు అంటున్నారు.
ఆనందించాలా? బాధపడాలా?
కాల్వకు అక్కడక్కడ గండ్లు పడి వందల ఎకరాలు నీటిలో మునిగిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. కృష్ణా జలాలు వచ్చాయని ఆనందించాలో.. చేతికంది వచ్చిన పంటలు అవే జలాల్లో మునుగుతున్నాయని బాధపడాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేఎల్ఐ కాల్వ ద్వారా వస్తున్న నీరు చివరి ఆయకట్టు వరకు చేరడం కష్టంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీరు ఎక్కువగా వచ్చి పంటలు నష్టపోయిన వారు కొందరైతే, పంటలకు నీరందక ఎండిపోయే పరిస్థితి ఎదురవుతోందని మరికొందరు అంటున్నారు. కాల్వ గండ్లపై అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నీటి ప్రవాహం ఉన్న కాల్వలను పరిశీలించి మట్టి కట్టలను సరిచేయాలని, ఉద్దేశపూర్వకంగా గండ్లు చేసేవారుంటే గుర్తించి అలా చేసేవారిని అడ్డుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఇదీ చదవండి: Congress Dharna: 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో ఆడుకుంటున్నాయి'