నాగర్ కర్నూల్ జిల్లా కేసరి సముద్రం చెరువు శిఖం భూ ఆక్రమణలపై ఈనాడు-ఈటీవీ భారత్ ప్రచురించిన వరుస కథనాలపై అధికార యంత్రాంగం స్పందించి చర్యలు చేపట్టింది. పట్టణంలోని రామ్ నగర్ కాలనీలోని ఆల్ సెయింట్స్ మోడల్ స్కూల్, లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ వద్ద వెలిసిన అక్రమ వెంచర్లను, కట్టడాల హద్దులను కూల్చివేసింది.
ఉయ్యాలవాడ సమీపంలోని కేసరి సముద్రం ఆక్రమణలు తొలగించేందుకు చెరువు లెవెల్స్‌ను నిర్ధరిస్తూ... హద్దులు ఏర్పాటు చేయడానికి అధికారులు జేసీబీల సాయంతో గుంతలు తీయించారు. ఈ హద్దులలో చెరువు చుట్టూ వెంచర్ల కోసం కట్టిన గోడలు, నాటిన రాళ్లను వేసిన మట్టిని అధికారులు తొలగించారు.
అధికారులు చెరువు వద్ద హద్దులను గుర్తిస్తున్న సమయంలో రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. చెరువులో ప్రాజెక్ట్ కోసం తీసిన మట్టిని.. అలుగు వద్ద చెక్కలను తొలగించి సర్వే చేసిన తర్వాతే హద్దులను నిర్వహించాలని రైతులు.. అధికారులను డిమాండ్ చేశారు. చెక్కలను పెట్టడం వల్ల ఎఫ్.టి.ఎల్ పెరిగిందని ఆరోపించారు.
జేసీ ఆదేశాల మేరకు హద్దులను నిర్ణయించే ప్రక్రియను కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు. శిఖం భూముల్లో వెంచర్లు వేయడానికి వీలు లేదని.. ఎఫ్.టి.యల్, బఫర్ జోన్ పరిధిల్లో ఉన్న భూముల్లో ఎలాంటి కట్టడాలు నిర్మించడానికి వీలులేదని అధికారులు హెచ్చరించారు.