Harish Rao Nagarkurnool Tour : నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అచ్చంపేటలో నిర్మించిన వంద పడకల ఆసుపత్రితో పాటు డయాలసిస్ కేంద్రాన్ని హరీశ్‌రావు ప్రారంభించారు. రూ.75 కోట్ల వ్యయంతో నిర్మించిన 150 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించిన పంపిణీ పత్రాలను లబ్ధిదారులకు అందించారు. పట్టణంలో బీటీ రోడ్డు, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం అచ్చంపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన హరీశ్‌రావు.. రాష్ట్రంలో ప్రతిపక్షాలను నమ్ముకుంటే అది ఆత్మహత్య సదృశ్యమని, కేసీఆర్ అధికారంలోకి వస్తే జలదృశ్యం సాకారమవుతుందని అన్నారు. జలదృశ్యం కావాలో, ఆత్మహత్య సదృశ్యం కావాలో తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలని హరీశ్ రావు సూచించారు. అచ్చంపేట నియోజక వర్గ ప్రజల దశాబ్దాల కల ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకాన్ని నిజం చేసిన ఘనత బీఆర్‌ఎస్ పార్టీదని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ త్వరలో ప్రారంభిస్తామని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. కాంగ్రెస్ పాలనలో పాలమూరులో కరవుకాటకాలు, వలసలు తప్ప అభివృద్ధి లేదని అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత వలసలు తగ్గాయని పేర్కొన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలు అందని ఇల్లే లేదని, ఇక్కడి పథకాలు దేశంలో ఎక్కడా లేవని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజలు గర్వపడేలా కేసీఆర్ సచివాలయాన్ని నిర్మిస్తే ఒకరు కూల్చేస్తామని.. మరొకరు పేల్చేస్తామని అంటున్నారని ధ్వజమెత్తారు.
బీజేపీలో ఎవరూ చేరేలా లేరని చేరికల కమిటీకి అర్థమైంది: తెలంగాణను నిర్మించే నాయకుడు కావాలి తప్ప.. కూల్చే, పేల్చే నాయకులు రాష్ట్రానికి ఎందుకని హరీశ్‌రావు ప్రశ్నించారు. బీజేపీలో ఎవరూ చేరేలా లేరని ఆ పార్టీ చేరికల కమిటి ఛైర్మనే చెప్పారని అన్నారు. తెలంగాణపై కేసీఆర్‌కు ఉన్నంత ప్రేమ.. రాహుల్, మోదీలకు ఉంటుందా అని ధ్వజమెత్తారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన తెస్తామని హిమాచల్ ప్రదేశ్ సీఎం జడ్చర్లలో చెప్పిన విషయాలు గుర్తు చేసిన హరీశ్‌రావు.. కరెంటు కోతలు, ఎరువుల కోసం ధర్నాలు చేసిన అప్పటి కాంగ్రెస్ పాలనను ఎవరు కోరుకుంటారని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ పాలనపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హరీశ్ సూచించారు. విషం చిమ్మితే విషయంతో తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. డబల్ బెడ్ రూములు రానివాళ్లు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని గృహలక్ష్మితో వాళ్ల కల సహకారం చేస్తామని భరోసా ఇచ్చారు. పైసా ఖర్చు లేకుండా లంచం లేకుండా పేదవారికి సొంతింటి కల సహకారం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని అని హరీశ్‌రావు అన్నారు.
ఇవీ చదవండి: