ఉమ్మడి మహబూబ్‌నగర్ వ్యాప్తంగా వర్షాలు కురిసినా నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లా రైతులకు ఎక్కువ నష్టం కలిగినట్లు ప్రాథమిక అంచనా. చేతికి వచ్చిన వరి పంట దెబ్బతిన్నది. కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం నీట తడిసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ జిల్లాలో దాదాపు వంద ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు పేర్కొన్నారు.
కల్వకుర్తి, తిమ్మాజిపేట, నాగర్‌కర్నూల్, రేవల్లి, ఖిల్లాగణపురం, మరికల్, నారాయణపేట, లింగాల, భూత్పూర్, గోపాల్‌పేట తదితర మండలాల్లో కొన్నిచోట్ల వడగండ్లు పడ్డాయి. వనపర్తి, కొత్తపేట, అమరచింత తదితర మండలాల్లోనూ ఈదురుగాలులతో మామిడి, బత్తాయి తోటలు దెబ్బతిన్నాయి.
భూత్పూరు మండలంలో బొప్పాయి దెబ్బతిన్నది. మరికల్, హన్వాడ, మహబూబ్‌నగర్ మండలాల్లో కూరగాయల తోటలకు నష్టం వాటిల్లింది. పలు మండలాల్లో స్తంభాలు విరిగి పడి, తీగలు తెగిపోయి మూడు గంటలపాటు విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగింది.
గత 20 రోజుల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు 10 వేల ఎకరాలకుపైగా వరి, తదితర పంటలు వర్షాలతో దెబ్బతిన్నాయి. దాదాపు రెండు వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలను పంపారు.