శ్రీశైలం జలాశయం మిగులు జలాల నుంచి నీటిని ఎత్తిపోసేందుకు డిండి ఎత్తిపోతల పథకం రూపొందించారు. రోజుకు అర టీఎంసీ ఎత్తిపోయడం ద్వారా 2 నెలల్లో 30 టీఎంటీసీలను... నాగర్‌కర్నూల్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లోని 21 మండలాల్లో 3 లక్షల 61వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. దీని ద్వారా నాగర్‌కర్నూల్ జిల్లాలోని 4 మండలాలకు సుమారు 14 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. రూ.6190 కోట్ల అంచనా వ్యయంతో 2015లో ప్రభుత్వం పరిపాలన అనుమతులొచ్చాయి. నాగర్‌కర్నూల్ జిల్లా ఉల్పర బ్యారేజీ నుంచి నల్గొండ జిల్లా శివన్నగూడెం జలాశయం వరకు 66.30 కిలోమీటర్ల ప్రధాన కాలువ సహా 9 జలాశయాలను నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం 2016 నుంచి భూసేకరణ ప్రారంభమైంది. కానీ నాగర్‌కర్నూల్ జిల్లాలో డిండి ఎత్తిపోతల పథకం కోసం భూములు అప్పగించిన రైతుల పరిస్థితి మాత్రం ప్రస్తుతం దయనీయంగా తయారైంది. డీఎల్ఐ కోసం 2017లోనే భూములు సేకరించినా ఇప్పటికీ వారికి పరిహారం అందలేదు. ఎకరాకు ఐదున్నర లక్షలు పరిహారం చెల్లిస్తామని అప్పట్లో చెప్పారు. మూడేళ్లు గడిచినా డబ్బులు మాత్రం అందలేదు.
మూడు రెట్లు కావాలి..
ఇచ్చిన భూములకు పరిహారం రాకపోవడం ఒక ఎత్తైతే, మూడేళ్లుగా ఆ భూములపై రావాల్సిన ఆదాయాన్ని సైతం రైతులు కోల్పోయారు. సేకరించిన భూముల్లో కొన్నిచోట్ల కాల్వలు తవ్వి వదిలేశారు. కొన్నిచోట్ల భూముల్ని పడావుగానే ఉంచారు. తాము భూములు కోల్పోయినా... ఇతర రైతులకైనా మేలు జరిగిందా అంటే అదీలేదు. ప్రభుత్వమిచ్చే ఎకరా పరిహారంతో ఇప్పుడు గుంట భూమి కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఎకరా రూ.40 నుంచి రూ. 50లక్షలు పలుకుతోంది. 2016లో పక్క గ్రామంలో సబ్‌స్టేషన్ కోసం ఎకరా రూ.5.75 లక్షలు చెల్లించిన అధికారులు తమకు మాత్రం ఐదున్నర లక్షలే చెల్లించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ విలువకు మూడు రెట్లు పరిహారం కావాలని డిమాండ్ చేస్తున్నారు.
పరిహారానికి ఎదురుచూపులు
నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి రెవిన్యూ డివిజన్ పరిధిలో 2వేల మంది రైతులు డీఎల్ఐ కోసం భూములు కోల్పోయారు. మొత్తం 3678 ఎకరాల భూములు సేకరించాల్సి ఉంది. వీటిలో 490ఎకరాలు ప్రభుత్వ భూములు. 3,183 ఎకరాలు పట్టా భూములు. అందులో 2,470 ఎకరాలను ఇప్పటికే రైతుల నుంచి సేకరించారు. మరో 1,208 ఎకరాలు సేకరించాల్సి ఉంది. రైతులు అప్పగించిన భూముల్లో 707 ఎకరాలకు రూ.38.94 కోట్లు చెల్లించారు. మరో 1,285 ఎకరాలకు రూ.72 కోట్ల పరిహారం సిద్ధంగా ఉంది. రైతుల ఖాతా వివరాలు సేకరించి ఒక్కొక్కరి ఖాతాల్లో ప్రస్తుతం డబ్బులు జమ చేస్తున్నారు. 488 ఎకరాలకు డబ్బులు చెల్లించాల్సి ఉంది. ఈ పరిహారం కోసం రైతులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వీరి పరిహారం కోసం ప్రభుత్వానికి ప్రతిపాధనలు పంపినట్టు కల్వకుర్తి ఆర్డీవో రాకేశ్ తెలిపారు. అంతకుముందు ప్రకటించిన దానికంటే ఎక్కవ పరిహారం కావాలని రైతులు కోరుతున్నట్టు ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్టు వివరించారు.
ఇదీ చూడండి: జోగులాంబ జిల్లాలో జోరుగా క్యాట్‌ఫిష్ సాగు