నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ పోతుగంటి రాములు అధ్యక్షత వహించారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో సమన్వయం కోసం కమిటీకి అధ్యక్షుడిగా పార్లమెంట్ సభ్యులు, మెంబర్ సెక్రటరీగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, మున్సిపల్ ఛైర్మన్లు, ఐదుగురు సర్పంచులు, ఒక ఎన్జీవో ఇందులో సభ్యులుగా ఉంటారని ఆయన తెలియజేశారు.
దిశ కమిటీ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే నిధులు ఖర్చు, పథకాలు అమలు తదితరాలను పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా జిల్లా అభివృద్ధికి పని చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్, జడ్పీ ఛైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, జైపాల్ యాదవ్ సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.