నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం ఈర్లపెంట వాసులకు కాలినడకే దిక్కు. రేషన్ సరకులు తీసుకోవాలన్నా, పశువులకు నీళ్లు తాగించాలన్నా 19 కిలోమీటర్లు దూరంలో ఉన్న అప్పాపూర్ వరకు కాలినడక రావాలి. రాళ్లు, రప్పల దారిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ఈర్లపెంట వాసులు...వైద్యం సహా ఇతర సేవల కోసం 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్ననూర్ గ్రామానికి వెళ్తారు. ఈర్లపెంట నుంచి అప్పాపూర్ వరకు నడిచి వచ్చి అరకొరగా ఉన్న ఆటోల్లో మన్ననూర్ వరకు వెళ్తారు.
కరోనా సమయంలో నిత్యావసర సరకులు పంపిణీ చేసేందుకు వచ్చిన ఐటీడీయే పీవో అఖిలేశ్‌రెడ్డిని ఈర్లపెంట చెంచుల దైన్యస్థితి కలచి వేసింది. వెంటనే ఈర్లపెంట నుంచి అప్పాపూర్ వరకు 19 కిలోమీటర్ల రహదారి పనులు మంజూరు చేయించారు. జాతీయ ఉపాధిహామీ పథకం కింద చెంచులకు ఉపాధి కల్పిస్తూ వారితోనే రహదారి పనులు పూర్తి చేయించారు.
తాగునీటి సమస్య పరిష్కారం కోసం మిషన్ భగీరథ పథకాన్ని ఉపయోగించుకుని బావి పనులకు మరమ్మతులు చేసుకున్నారు. ఉపాధి కోల్పోతున్న కరోనా కాలాన్ని ఈర్లపెంట వాసులు ఉపాధి కల్పన కాలంగా మలచుకుని 772 పనిదినాలు శ్రమించి రహదారి నిర్మాణం, తాగునీటి ఎద్దడి తీర్చుకున్నారు. ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కారించుకున్నారు.
ఇదీ చూడండి: ఆసిఫాబాద్‌లో రెండోరోజు డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటన