దళిత, గిరిజనుల సమస్యలు పరిష్కారించడానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. ప్రతి గిరిజన బిడ్డ ఉన్నత విద్య అభ్యసించాలని, ఎవరూ కూలీ పనులకు వెళ్లొద్దని కోరారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుతో కలిసి పర్యటించారు.
ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆశ్రయం కల్పించి ఎస్సీ కమిషన్ ద్వారా విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఎవరైనా సామాజికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేసినా కమిషన్ను ఆశ్రయించవచ్చని పేర్కొన్నారు. అమ్రాబాద్ మండలంలో స్థానిక పోలీస్ స్టేషన్లో షటిల్ గ్రౌండ్ ఆవిష్కరించారు.
రోడ్డు భద్రతా ప్రమాణం చేయించి మన్ననూర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. గిరిజనులతో కలిసి నృత్యాలు చేశారు. దళిత, గిరిజనులకు ఏ సమస్య వచ్చినా కమిషన్ దృష్టికి తీసుకురావాలన్నారు. ఉన్నత విద్య అభ్యసన వల్ల తాము ప్రజా ప్రతినిధులమయ్యామని తెలిపారు.
నల్లమల అటవీ ప్రాంతంలోని అప్పాపూర్ చెంచుపెంటను సందర్శించారు. స్థానికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వారు తమకున్న సమస్యలు తెలియజేయగా త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి: 'సమస్యల పట్ల స్పందించిన మంత్రులకు ధన్యవాదాలు'