Bhatti Vikramarka Fires on Cm KCR : వట్టెం రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో నిర్లక్ష ధోరణిపై.. సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసినట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్వాసితుల కష్టాలపై ఆందోళన వ్యక్తం చేశారు. సరైన ప్యాకేజీ, ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా రైతుల భూములు లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితులంతా గిరిజనులేనన్న భట్టి.. సర్వం లాక్కొని వారిని బజారున పడేశారని ఆరోపించారు. సీఎం ఇచ్చిన ఏ హామీ నెరవేరలేదని విమర్శించారు.
Bhatti on Vattem Reservior : భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర.. 74వ రోజు నాగర్‌కర్నూలు జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్‌కు చేరుకుంది. ఈ క్రమంలోనే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద.. వట్టెం రిజర్వాయర్ నిర్వాసితులకు కేవలం తాత్కాలిక పరిహారం అందించి.. రైతులను నట్టేట ముంచారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. వారంతా గిరిజనులేనని.. వారి దగ్గర సర్వం లాక్కొని బజారున పడేశారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు వద్ద కుర్చీ వేసుకొని కూర్చుని మూడేళ్లలో పూర్తి చేస్తానని కేసీఆర్ అన్న మాట ఏమైందని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు పదేళ్లయిన ప్రాజెక్టు పూర్తి కాకపోవడం దారుణమని అన్నారు. ముఖ్యమంత్రి నిర్వాసిత కుటుంబాలకు. ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదని ఆయన ఆక్షేపించారు.
"లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించిన వట్టెం రిజర్వాయర్‌ను నిన్న సందర్శించాను. భూమి కోల్పోయిన నిర్వాసితులకు ప్రాజెక్టు కింద భూమికి భూమి ఇవ్వాలి. గ్రామాన్ని నిర్మించి ఇవ్వాలి. సంపూర్ణమైన సౌకర్యాలైన బడి, గుడి, ఆస్పత్రితో సహా అంగన్వాడీని కూడా నిర్మించి ఇవ్వాలి. ఇలాంటి వసతులతో నిర్మించిన గ్రామం ఏర్పాటు చేసిన తర్వాతనే నిర్వాసితులను అక్కడి నుంచి తరలించాలి. ఈ విషయాన్ని చట్టం చెబుతుంది. కానీ చట్టబద్దంగా చేయలేదు. రాత్రికి రాత్రే 120 జీవో తెచ్చారు.. మళ్లీ ఆ జీవో ప్రకారం కూడా చేయలేదు. ఏ రకంగా ప్రజల పట్ల బాధ్యతే లేదు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వాసితుల సమస్యలపై బహిరంగ లేఖ రాస్తున్నాను."_భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
శనివారం పాదయాత్రలో భాగంగా భట్టి విక్రమార్క ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ కార్యాలయాలు వేగవంతంగా నిర్మిస్తున్నారని.. పేదలకు ఇల్లులు ఎందుకు నిర్మంచడంలేదని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఆయన స్థానిక ప్రజలతో ముచ్చటించారు. వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. వీటితో పాటు పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఏమి చేస్తుందని వివరించారు. తన పాదయాత్రలో అనేక సమస్యల గురించి తెలుసుకున్నారని.. వాటికి పరిష్కార మార్గాలు అన్వేషిస్తానని భట్టి విక్రమార్క వెల్లడించారు.
ఇవీ చదవండి: