నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం కోమటికుంటకి చెందిన రామచంద్రమ్మ(70) కుమారుడు రాములు(40) హైదరాబాద్‌లోని షేక్‌పేట్ ప్రాంతంలోని దర్గా వద్ద ఉంటున్నాడు. ఇక్కడే కూలి పని చేసుకుంటూ భార్యాబిడ్డలను పోషించుకుంటున్నాడు. తన తల్లి కూడా ఇక్కడే తనతో ఉండేది. లాకౌడౌన్కు ముందు మరో కొడుకు దగ్గరికని ఊరెళ్లింది. కానీ లాక్‌డౌన్‌తో పరిస్థితులు మారిపోవటంతో కొడుకుపై ఉన్న మమకారంతో ఒక్కసారిగా ఆ తల్లి గుండెల్లో ఆందోళన పెరిగింది. గ్రామంలో తన కుటుంబీకులు ఉన్నా.. కరోనా లాక్‌డౌన్ పరిస్థితుల్లో బతుకుదెరువుకు హైదరాబాద్ వెళ్లిన తన కొడుకు ఎలా ఉన్నాడో అని అల్లాడిపోయింది. ఎలాగైనా కొడుకు చేరాలనుకుంది.
కొడుకు యోగక్షేమాలు తెలుసుకుందామని ప్రయత్నిస్తే ఆయన సెల్‌ఫోన్ కూడా పనిచేయలేదు. లాకౌడౌన్ మొదలయ్యే సమయంలోనే ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది. కరువు కాలంలో ఫోన్ రీఛార్జ్ కూడా చేయించుకునే స్థోమత లేక రాములు అలానే వదిలేశాడు. కొడుకు ఫోన్ కలవకపోవటంతో తన కొడుక్కు ఏమైందో, కొడుకు కుటుంబం కరోనా విపత్తులో ఎలాంటి పరిస్థితుల్లో ఉందోనన్న ఆందోళన పెరిగింది. డబ్బులు లేకున్నా.. ఊళ్లోంచి వెళ్లొద్దని వారించినా.. ఎలాగైనా కొడుకును కలవాలని తలంచి.. ఊళ్లో ఎవరికీ చెప్పాపెట్టకుండా కాలినడకన రామచంద్రమ్మ హైదరాబాద్ నగరానికి బయలుదేరింది.
140 కిలోమీటర్లు నడిచి హైదరాబాద్ చేరాక ఫోన్ చేద్దామనుకున్న ఆ తల్లికి ఇక్కడికి వచ్చాక నిరాశే ఎదురైంది. కొడుకు చిరునామా తెలియక.. మహానగరంలో దారితప్పి చాంద్రాయణగుట్టకు వచ్చింది. ఎటుపోవాలో తెలీని దుస్థితి.. దానికితోడు కడుపులో ఆకలి. రెండు మూడు రోజులు గడిచాయి. బుధవారం ఉదయం తన ఇంటి ముందు భిక్షాటన చేస్తున్న ఆ వృద్ధురాలిని.. స్థానిక తెదేపా నాయకుడు గాజుల వెంకటరమణ కదిలించగా విషయం చెప్పింది.
వెంటనే రంగంలోకి దిగిన వెంకటరమణ సామాజిక మాధ్యమంలో ఆమె వివరాలను పొందుపర్చారు. ఆ వివరాలను చూసిన భాజపా నాయకుడు నవీన్‌యాదవ్.. వెంకటరమణను సంప్రదించి.. రాములు ఆచూకీ కనిపెట్టారు. ఇద్దరూ కారులో ఆమెను తీసుకెళ్లి కుమారుడి వద్దకు చేర్చారు. ఫోన్ కలవకపోవటంపై ఆరా తీస్తే.. తినేందుకే కష్టంగా ఉందని, డబ్బులు లేకనే ఫోన్ రీఛార్జ్ చేయించనందునే కలవలేదని రాములు చెప్పగా చలించిపోయారు.
కుమారుడిని చూసిన రామచంద్రమ్మ ఆనందానికి అవధుల్లేవు.
ఇదీ చూడండి: 'పోస్ట్ ఇన్ఫో'తో ఔషధాలు, మాస్కులు డోర్ డెలివరీ