Special Buses to Medaram Jatara: దక్షిణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతరకు సంబంధించి.. ఆర్టీసీకి ఇది అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జాతర. ప్రతి జాతరలో కొన్ని లక్షల మందిని ఆర్టీసీ బస్సుల ద్వారా మేడారానికి తరలిస్తుంది. ఈ ఏడాది కూడా తెలంగాణ ఆర్టీసీ అందుకు సమాయాత్తమవుతోంది. ఈ సందర్భంగా హనుమకొండలోని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కార్యాలయంలో ఈడీ మునిశేఖర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మేడారం జాతరకు రాష్ట్రంలోని వివిధ డిపోలకు చెందిన 3,845 బస్సులను నడుపుతున్నామని ఈడీ తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 51 పాయింట్లను ఏర్పాటు చేశామని.. ఈ నెల 13 నుంచి 20 వరకు ప్రత్యేక బస్సులను నడుపుతామని చెప్పారు. వరంగల్ పరిధిలో 51 చోట్ల నుంచి 2,200 బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. హనుమకొండలో మూడు పాయింట్స్ ఏర్పాటు చేశామని.. ఇక్కడి నుంచి 900 బస్సులు నడపనున్నామని చెప్పారు. సుమారు 21 లక్షల మందిని తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
"వరంగల్ పరిధిలో 51 చోట్ల నుంచి 2,200 బస్సులు అందుబాటులో ఉంటాయి. నగరంలో 3 చోట్ల నుంచి 900 బస్సులు నడుస్తాయి. ఆర్టీసీ బస్సులు మేడారం వరకు వెళ్తాయి. ప్రైవేటు వాహనాలు నార్లాపూర్ వరకు వెళ్తాయి. కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి నిత్యం పర్యవేక్షణ ఉంటుంది. మూడు అంబులెన్సులతో మెడికల్ సెంటర్ ఏర్పాటు చేశాం. బస్సు టికెట్లు మేడారంలో కాకుండా తాడ్వాయిలో ఇస్తారు." -మునిశేఖర్, ఆర్టీసీ ఈడీ
క్రితం ధరలే..
వన దేవతల గద్దెల సమీపానికి బస్సులు వెళ్తాయని ఈడీ మునిశేఖర్ చెప్పారు. ప్రైవేటు వాహనాలు నార్లాపూర్ వరకు వెళ్తాయని వివరించారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి నిత్యం పర్యవేక్షణ ఉంటుందని.. మూడు అంబులెన్సులతో మెడికల్ సెంటర్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ మేరకు వివిధ ప్రాంతాల నుంచి బస్సు ధరలను కూడా నిర్ణయించామని పేర్కొన్నారు. ఈసారి ఛార్జీలను పెంచలేదని.. క్రితం జాతర ధరలే ఉంచామని వెల్లడించారు. బస్సు టికెట్లు మేడారంలో కాకుండా తాడ్వాయిలో ఇస్తారని వివరించారు. 30 మంది ఉన్న ఇంటి వద్దకు ఈనెల 11వరకు బస్సు సౌకర్యం ఉంటుందన్నారు. కరోనా నేపథ్యంలో బస్సులకు శానిటైజేషన్ చేస్తున్నామని.. భక్తులు తప్పకుండా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితమని.. భక్తులు ఆర్టీసీలోనే ప్రయాణించాలని సూచించారు.
ఇదీ చదవండి: ఆరో రోజు శోభాయమానంగా ఉత్సవాలు.. జనసంద్రంగా శ్రీరామనగరం..
Medaram Arrangements : వనదేవతల జాతరకు పటిష్ఠ ఏర్పాట్లు : సత్యవతి రాఠోడ్