లక్నవరం సరస్సు ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సరస్సు అందాలను తిలకిస్తున్నారు. వనభోజనాలు ఏర్పాటు చేసుకుని సరదాగా గడుపుతున్నారు. పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చి ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తున్నారు.
కేరింతలు...
ఎనమిది నెలలుగా కరోనా వైరస్ కారణంగా పర్యాటక ప్రాంతాలు మూతపడ్డాయి. ఇటీవలె పర్యాటక ప్రాంతాల సందడి మళ్లీ మొదలైంది. కొండకోనల్లో నెలకొని ఉన్న సరస్సు అందాలను... ఊయల వంతెనలో నడుచుకుంటూ పర్యాటకులు కేరింతలు కొడుతున్నారు. కార్తీక మాసం కావడంతో కొంతమంది చెట్ల కింద వనభోజనాలు ఏర్పాటు చేసుకొని సరదాగా గడుపుతున్నారు.
చెప్పలేని సంతోషం...
ఆదివారం సెలవు దినం కావడంతో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ జిల్లాల నుంచి పర్యాటకులు వేలాదిగా తరలివచ్చారు. ఈ ప్రకృతి రమణీయతని తిలకించకుండాఉండలేమని పర్యాటకులు అంటున్నారు. కరోనా నేపథ్యంలో ఇంటిపట్టునే ఉన్నామని... చాలా రోజుల తర్వాత స్నేహితులు, బంధువులతో కలిసి ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతున్నామని తెలిపారు. చుట్టూ కొండలు... సరస్సులో ఊయల వంతెనపై పరిగెడుతుంటే చాలా సంతోషంగా ఉందని చెబుతున్నారు.
ఇదీ చదవండి: పర్వదినాల మాసం... మహిమాన్విత కార్తికం