పర్యాటకుల ప్లాస్టిక్ వ్యర్థాలతో అభయారణ్యం కలుషితమవుతున్నాయి. దీనికి తోడు అటవీశాఖ నివారణ చర్యలు చేపట్టకపోవడంతో వన్యప్రాణులకు ముప్పుగా మారుతోంది. ములుగు జిల్లాలోని పస్రా-ఏటూరునాగారం మధ్య జాతీయరహదారిపై ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. పర్యాటకులారా నిర్లక్ష్యం వీడి కాస్త ఆలోచించండి.
పస్రా నుంచి మంగపేట వరకు...
జిల్లాలో గోవిందరావుపేట మండలంలోని పస్రా నుంచి ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం.. అలాగే కన్నాయిగూడెం, మంగపేట వరకు అభయారణ్యం విస్తరించి ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు అడవిలో వనభోజనాలు చేస్తుంటారు. వారి వెంట తెచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎక్కడ పడేయాలో తెలియక అక్కడే వదిలేసి వెళ్తున్నారు. దీంతో అభయారణ్యం రహదారులు చెత్తమయంగా మారుతున్నాయి. దీనికితోడు గ్రామాల సమీపంలో స్థానికంగా భవన శిథిలాలు, పంచాయతీ చెత్త కూడా అడవిలోనే పడేయడంతో అరణ్యం అధ్వానంగా మారుతోంది.
వన్యప్రాణుల మనుగడకు ముప్పు
అటవీ సంపదతో పాటు పరిసరాలను సంరక్షించాల్సిన సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పర్యాటకుల ఆనందం అభయారణ్యానికి శాపంగా మారింది. దీనికి పర్యావసనంగా అడవి కాస్త ప్లాస్టిక్ వనం అవుతోంది. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు, పగిలిన గాజు సీసాలు వన్యప్రాణుల మనుగడను ప్రశ్నిస్తున్నాయి. అయినా ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి వెంటే అటవీశాఖ కార్యాలయాలు, తనిఖీ కేంద్రాలు ఉన్నా పర్యాటకులకు అవగాహన కల్పించడంలో చొరవ తీసుకోలేకపోతున్నారు. అటవీశాఖ వారోత్సవాల సందర్భంగా ఏడాదికోసారి మాత్రం అధికారులు, సిబ్బంది హడావుడిగా చెత్తను ఏరిపారేస్తుంటారు. తర్వాత షరామామూలుగానే జరుగుతోంది.
ఒక్క సారి ఆలోచిస్తే మేలు
ఏదో సరదాకు ఏజెన్సీలోని అభయారణ్య ప్రాంతాలకు వస్తున్న పర్యాటకులు కూడా దూరదృష్టితో ఆలోచించాల్సి ఉంటుంది. నగరాలు, పట్టణాల్లో చెత్త కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలిసిందే. అలాంటప్పుడు అటవీప్రాంతాల్లో రీసైకిల్ చేయలేని ప్లాస్టిక్ వస్తువులు పాడేసి వెళ్లడంతో పర్యావరణానికి తీరని నష్టం జరుగుతోంది. చెత్తను వదిలి వెళ్లకుండా ఎక్కడైనా చెత్తకుండీలు కనిపిస్తే అక్కడ పడేయండి. వన్యప్రాణులకు, అడవులకు మేలు చేసిన వారవుతారు.
నిర్వహణ లోపంతో చెత్తకుండీలు కనుమరుగు
గత ఏడాది మేడారం సమ్మక్క, సారక్క జాతరలో అటవీశాఖ తరఫున తాడ్వాయి నుంచి మేడారం రహదారిలో చెత్తకుండీలను ఏర్పాటు చేశారు. దీంతో అటవీ ప్రాంతాల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించారు. తర్వాత ఆ చెత్తకుండీలు నిర్వహణ లోపంతో మూలనపడ్డాయి. గ్రామపంచాయతీల్లో డంపింగ్‌యార్డులను ఏర్పాటు చేయడంతో చెత్తకుండీలు కనుమరుగయ్యాయి. ఈ విషయంలో అటవీశాఖ ఆధ్వర్యంలో పర్యావరణహితంగా చెత్త సేకరణకు కుండీలు లేదా బయోరీసైక్లింగ్ యంత్రాలను ఏర్పాటు చేయడం ద్వారా అడవిని చెత్త బారి నుంచి సంరక్షించుకోవచ్ఛు తద్వారా స్వచ్ఛమైన వాతావరణంతో పాటు అడవి అందాలను ఆస్వాదించవచ్చు.
ఇదీ చూడండి : గణతంత్ర వేడుకలకు ముస్తాబవుతున్న పబ్లిక్ గార్డెన్