school top collapsed: ములుగు జిల్లాలో పాఠశాల భవనం పైకప్పు కూలిన ఘటనలో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. జిల్లాలోని ఎదిర గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన విద్యార్థులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు ఎలాంటి ప్రాణాపాయం లేనట్లు తెలుస్తోంది.
నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాథమికోన్నత పాఠశాలలో ఉన్న ఒక భవనం పైకప్పుపై నిర్మించిన గోడ కూలింది. మధ్యాహ్నం భోజనం చేశాక ఒకటో తరగతి విద్యార్థి సంతోశ్, రెండో తరగతి విద్యార్థిని విషిత, మూడో తరగతి విద్యార్థి నికిత భవనం పక్క నుంచి పోతుండగా ఒక్కసారిగా పైకప్పు కూలడంతో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిని ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.
పాఠశాలలు ప్రారంభమై మూడు నెలలైనా శిథిలావస్థకు చేరుకున్న వాటి పట్ల ప్రభుత్వం దృష్టి సారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాంటి స్కూళ్లపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థులు ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలలపై అధికారులు ఇప్పటికైనా స్పందించి శిథిలావస్థకు చేరిన భవనాల్లో తరగతులు నిర్వహించవద్దని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చదవండి: షెకావత్ జీ కాళేశ్వరంపై మాటలు సరే, చర్యలు ఏంటో తెలపాలంటూ రేవంత్ ట్వీట్