వనదేవతల వేడుకలకు మేడారం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పరిచారు. ఇప్పటికే వాహన రాకపోకలకు ఇబ్బంది లేకుండా వన్ వే తీసుకొచ్చారు. వాహనాల రాకపోకలతో పాటు రోడ్లపై ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ప్రదేశాల ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. జాతరకు విధులు నిర్వహించనున్న 10 వేల మంది పోలీస్ సిబ్బందిలో 4 వేల మంది ట్రాఫిక్ నియంత్రణకు పనిచేయనున్నారు. ఒకేసారి 2 లక్షలకు పైగా వాహనాలను నిలిపేలా 38 పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశారు. రహదారులను 20 సెక్టార్లుగా విభజించి ఇద్దరు డీసీపీలు, ఓ ఎస్పీని ఇన్‌ఛార్జీగా నియమించారు.
200 నిఘా నేత్రాల కనుసన్నుల్లో...
ఈ నెల మూడు నుంచి 8 వరకు ములుగు మండలం మల్లంపల్లి నుంచి ఊరట్టం వరకు 30 బృందాలు... ద్విచక్ర వాహనాలపై 24 గంటలూ గస్తీ నిర్వహించనున్నారు. రహదారి పొడవునా వాహనాల రాకపోకలను పరిశీలించేందుకు... 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని అధికారులు పేర్కొన్నారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు.. విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా హన్మకొండ, పస్రా మధ్య హోల్డింగ్ పాయింట్లను సిద్ధం చేశారు.
వీడియో అనలైటింగ్ సిస్టం ద్వారా...
జాతరకు ఇద్దరు ఐజీలు, ఇద్దరు కమిషనర్లు సహా ఆరుగురు ఎస్పీలు... ట్రాఫిక్, బందోబస్తును పర్యవేక్షించనున్నారు. కుంభమేళా తరహాలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రద్దీ నియంత్రణ చేస్తున్నారు. వీడియో అనలైటింగ్ సిస్టం ద్వారా రద్దీని నియంత్రించేందకు కృషి చేస్తున్నారు.
350 సీసీ కెమెరాలు, 8 డ్రోన్ కెమెరాల ఏర్పాటుతో దొంగతనాల నిరోధానికి పోలీసులు మఫ్టీలో విధులు నిర్వర్తించనున్నారు. ఎక్కడికక్కడ బుడుగలను పెట్టడం ద్వారా తప్పిపోయిన వారి ఆచూకీ కనుగొంటామని చెప్పారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని... వాహనదారులు బాధ్యాతాయుతంగా నడపాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చూడండి : మేడారం జాతరకు భారీ బందోబస్తు