Medaram Jatara Rtc Buses: వచ్చే ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగే మేడారం మహాజాతర కోసం తెలంగాణ ఆర్టీసీ 3845 బస్సులు నడిపేందుకు నిర్ణయించింది. సుమారు 21 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో 2020లోనూ దాదాపు ఇదే సంఖ్యలో ఆర్టీసీ సర్వీసులు నడిపింది. భక్తులు భారీగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి రానున్న నేపథ్యంలో ఒక్క వరంగల్ ఆర్టీసీ రీజియన్ నుంచే 2,250 బస్సులను నడిపేందుకు ఆమోదం లభించింది. ఈసారీ హైదరాబాద్ నుంచి ఏసీ బస్సులు నడవనున్నాయి. జాతర సమయంలో బస్సులను నిలిపేందుకు ఆర్టీసీ 50 ఎకరాల్లో భారీ బస్టాండును నిర్మిస్తోంది. స్థలాన్ని చదును చేసి టికెట్లకు క్యూ లైన్ల ఏర్పాటు పనులు బుధవారమే ప్రారంభమయ్యాయి.
మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఈసారి ప్రసాదం, పసుపు, కుంకుమలను పంపిణీ చేయాలనుకుంటున్నట్లు గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. అమ్మవార్లకు భక్తులు మొక్కుగా గద్దెలపై సమర్పించే బంగారం(బెల్లం), పసుపు, కుంకుమలను భక్తులు ఇంటికి తీసుకెళ్తారు. రద్దీలో కొద్ది మందికే ఇది సాధ్యమవుతోంది. ప్రసాదం కోసం భక్తులు గద్దెల వద్ద వేచి చూడటంతో దర్శనానికి వచ్చే ఇతర భక్తులకు ఆలస్యమవుతోంది.
దీనిని దృష్టిలో పెట్టుకుని 2022 ఫిబ్రవరిలో జరిగే జాతరలో మొక్కులు చెల్లించిన భక్తులకు ఉచితంగా ప్రసాదం పంపిణీ చేసే ఆలోచన ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. కోటి మందికి అందేలా బెల్లం, పసుపు, కుంకుమలను ప్రత్యేకంగా ప్యాకెట్ల రూపంలో సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. మేడారం జాతరను జాతీయ పండగగా గుర్తించడంతో పాటు నిధులు మంజూరు చేసి అభివృద్ధికి సహకరించాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కోరినట్లు తెలిపారు.
ఇవీ చూడండి: