మన్యంలో మావోయిస్టుల అలజడి సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. అడవుల్లో వీరి కోసం పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వరుస లేఖలతో మావోయిస్టులు తమ ఉనికిని చాటే ప్రయత్నం చేస్తున్నారు.
పట్టు సాధించేందుకు...
మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలకు ముందే అటవీ ప్రాంతాల్లో అలజడి రేగుతోంది. పోలీసు బలగాలు... అడవిని జల్లెడ పడుతుంటే... వారికి దొరకకుండా మావోయిస్టులు తప్పించుకుని తిరుగుతూ లేఖలతో సవాళ్లు విసురుతున్నారు. పట్టు సాధించేందుకు వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నారు.
జల్లెడ పడుతున్నారు...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు అటవీ ప్రాంతంలోనూ.. కుమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా మంగీ అడవుల్లోనూ ఇరువర్గాల మధ్య కాల్పులు... మావోయిస్టు కీలక నేతలు తప్పించుకోవడం కలకలం రేపాయి. అప్పట్నుంచి ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల పరిధిలోని అటవీ ప్రాంతంలో ముమ్మరంగా కూంబింగ్ జరుగుతోంది. తప్పించుకున్న మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్ అతని సహచరులు కోసం మూడు జిల్లాల పరిధిలోనూ పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.
వీడని ఉత్కంఠ..
ఇక మావోయిస్టులూ ఎంతమాత్రం వెనక్కితగ్గట్లేదన్నది వారు రాసిన లేఖల ద్వారా వెల్లడవుతోంది. కేడర్‌ను ఉత్తేజపరుస్తూ సమకాలీన అంశాలపై మీడియాకు వరుస లేఖలను విడుదల చేయడం చర్చనీయాంశమవుతోంది. జిల్లాలో డీజీపీ పర్యటన అనంతరం... రెండు రోజులకే అసలు అభివృద్ది నిరోధకులు ఎవరని ప్రశ్నిస్తూ మరో లేఖ విడుదల చేశారు. పాలకులు మారినా, అణచివేత చర్యలు ఆగడం లేదని ప్రస్తావించారు. తాజా పరిణామాలు తుపాను ముందర ప్రశాంత వాతావరణాన్ని తలపిస్తున్నా... ఏదో జరుగుతుందన్న ఉత్కంఠ మాత్రం వీడట్లేదు.
ఇవీ చూడండి: రికవరీలో అగ్రస్థానంలో దిల్లీ- మూడో స్థానంలో తెలంగాణ