Medaram jatara 2022 : కోటి మందికి పైగా భక్తులు తరలివచ్చి సమ్మక్క సారలమ్మలను దర్శించుకునే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన వేడుక.. మేడారం జాతర. దక్షిణ కుంభమేళాగా పిలిచే ఈ జాతర ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు జరగనుంది. భక్తులు ఇబ్బందులు లేకుండా అమ్మవార్లను దర్శనం చేసుకుని వెళ్లేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా వినియోగిస్తూ జాతరకు హైటెక్ హంగులు అద్దుతున్నారు.
డ్రోన్ కెమెరాలు.. కృత్రిమమేధ..
ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ ఆలయం నుంచి తాడ్వాయి మండలం మేడారం వరకు, జాతర పరిసరాలు, ప్రధాన కూడళ్లు, గద్దెల ప్రాంగణాలు, రద్దీ ప్రదేశాలు, పార్కింగ్ స్థలాల్లో పోలీసులు 385 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే, గగనతలం నుంచి పర్యవేక్షించేందుకు 5 నుంచి 8 వరకు డ్రోన్ కెమెరాలను అందుబాటులోకి తేనున్నారు. రద్దీ నియంత్రణకు క్రౌడ్ కౌంటింగ్ కెమెరాలను సిద్ధం చేస్తున్నారు. ఇవి కృతిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో పనిచేస్తాయి. చదరపు మీటరులో నలుగురు కంటే ఎక్కువ మంది ఉంటే మేడారం, పస్రాలలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంలకు సమాచారం ఇస్తాయి. పోలీసులు టీఎస్ కాప్ యాప్‌లో పాత నిందితుల సమాచారాన్ని నిక్షిప్తం చేశారు. అనుమానిత వ్యక్తులను ఆ యాప్‌లో ఫొటో తీస్తే పాత నిందితులను గుర్తిస్తుంది. భక్తులు అమ్మవార్లకు డబ్బును కానుకగా సమర్పించడానికి ఈ-హుండీని ఏర్పాటు చేశారు. దీనికోసం క్యూఆర్ కోడ్ స్కాన్‌ను అందుబాటులోకి తెచ్చారు.
అరచేతిలో సమస్తం..
మేడారం జాతరకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని www.medaramjathara.com వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఇందులో అమ్మవార్ల చరిత్ర, జాతర విశేషాలు, సమీప పర్యాటక, ఆధ్మాత్మిక ప్రదేశాల సమాచారాన్ని చేర్చారు. భక్తులకు సౌలభ్యంగా medaram jathara-Official పేరిట యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో పార్కింగ్ స్థలాలు, మరుగుదొడ్లు, తాగునీరు, వైద్యశిబిరాలు, స్నానఘట్టాలు, ఆర్టీసీ బస్టాండు తదితర వసతులు ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడికి ఎలా చేరుకోవాలో తెలిపే వివరాలు, హెల్ప్‌లైన్ నంబర్లను తెలుగు, ఆంగ్ల భాషల్లో పొందుపర్చారు. ఆర్టీసీ రూపొందించిన Medaram with TSRTC యాప్‌లో మేడారానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉన్న బస్సులు, ఛార్జీల వివరాలను అందుబాటులో ఉంచారు.
ఎల్‌ఈడీ తెరలపై ప్రత్యక్ష ప్రసారం
జాతర ఘట్టాల ప్రత్యక్ష ప్రసారానికి భారీ ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నారు. జాతరలో రద్దీతో తప్పిపోయిన చిన్నపిల్లలు, వృద్ధుల వివరాలనూ ప్రసారం చేస్తారు. జాతరలో పనిచేసే శాఖలు, అధికారుల మధ్య సమన్వయం, సమాచారాన్ని చేరవేయడానికి ప్రత్యేక వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేస్తున్నారు.
- ఇదీ చదవండి : Statue of Equality: సమున్నత మూర్తి.. మహోజ్వల దీప్తి