Satyavati Rathod in Medaram : మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. జాతర అభివృద్ధి పనులను మహబూబాబాద్ ఎంపీ కవిత, ములుగు ఎమ్మెల్యే సీతక్కతో కలిపి పరిశీలించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు వనదేవతలను దర్శించుకోవాలని మంత్రి సూచించారు. సోమవారం నాడు అమ్మవార్లను దర్శించుకున్న సత్యవతి రాఠోడ్... ఫిబ్రవరి 16, 17, 18, 19 తేదీల్లో జాతరను నిర్వహిస్తామని వెల్లడించారు.
భక్తులకు అన్ని సౌకర్యాలు
రూ.35 లక్షలతో బస్టాండ్ ఆవరణలో నిర్మించిన సులభ్ కాంప్లెక్స్‌ను మంత్రి ప్రారంభించారు. అతిథి గృహాలకు శంకుస్థాపన చేశారు. ఈ మహా మహాజాతరకు భక్తుల సౌకర్యం కోసం మూడు నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు కేటాయించింది. అప్పుడే ఆయా పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు కొన్ని పనులు పూర్తి కాగా... మరికొన్ని ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
వచ్చే నెలలో జరిగే మహా జాతరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కరోనా కట్టడికి తగు చర్యలు చేపట్టింది. భక్తులు కుడా నిబంధనలు పాటిస్తూ... భక్తిశ్రద్ధలతో అమ్మవార్ల దర్శించుకోవాలి. భక్తుల స్నానాల కోసం జంపన్నవాగు ఇరువైపులా బ్యాటరీ ఆఫ్ టాప్స్ నిర్మాణం పూర్తయింది. మహిళల కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేయడం జరిగింది.
-సత్యవతి రాఠోడ్, గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి
ఇదీ చదవండి: Medaram: మేడారంలో భక్తుల రద్దీ.. ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు