Sammakka Sarakka Tribal University : రాష్ట్ర ప్రజలు 9 ఏళ్లగా ఎదురుచూస్తున్న సమ్మక్క- సారక్క గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం నిర్మాణానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దేశంలోనే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాల్లో(Central Tribal University) ఇది మూడోవది కానుంది. ఈ విద్యాసంస్థను రెండు దశల్లో ఏర్పాటు చేసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) ద్వారా రూ.899 కోట్లు మంజూరు చేయనుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని రాష్ట్ర గిరిజన సంక్షేమ వర్గాలు అభిప్రాయపడుతోంది. తాత్కాలిక క్యాంపస్ కోసం ములుగు జిల్లా జాకారంలోని యువజన శిక్షణ కేంద్రంలో అవసరమైన మౌలిక సదుపాయాలు నాలుగేళ్ల క్రితమే సిద్ధం చేసినట్లు వెల్లడించాయి.
Sammakka Sarakka Central University Budget : తెలంగాణలో ఇప్పటికే భాగ్యనగరంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం(HCU) కొనసాగుతుంది. ఆ స్థాయిలో గిరిజన యూనివర్సిటీని అభివృద్థి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. గిరిజన వర్సిటీ నెలకొల్పేందుకు అవసరమైన డీపీఆర్ తయారీ, ఏర్పాట్ల బాధ్యతను కేంద్ర ప్రభుత్వం గతంలోనే హెచ్సీయూకు అప్పగించింది.
దీన్ని ఏర్పాటు చేసేందుకు 2019 లోనే విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తి, మౌలిక సదుపాయాలు, భవనాలు తదితర అంశాల్ని పరిగణనలోకి తీసుకుని.. రూ.1200 కోట్లతో పూర్తిస్థాయి నివేదికను రూపొందించింది. తాత్కాలికంగా తరగతి గదులు నిర్వహించవచ్చని.. దీనికి ఎలాంటి సమస్యలు లేవని కేంద్రానికి రిపోర్ట్ పంపింది. జాకారంలోని గిరిజన యువజన శిక్షణ కేంద్రాన్ని పరిశీలించి తరగతులు ప్రారంభించేందుకు అవకాశాలున్నాయని తెలిపింది. రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీని నెలకొల్పేందుకు సానుకూలంగా నివేదిక ఇచ్చింది. 2019 నుంచే తరగతులు ప్రారంభమవుతాయని గిరిజన సంక్షేమ వర్గాలు భావించినప్పటికీ వివిధ కారణాలతో వాయిదా పడింది.
Central Tribal University Land Issue in Telangana : కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర మానవ వనరులశాఖ పలు సమావేశాలు నిర్వహించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని గిరిజన సంక్షేమశాఖను ఆదేశించింది. గిరిజన సంక్షేమశాఖ 169.35 ఎకరాల భూమిని గుర్తించి ఐటీడీఏ ఏటూరు నగరానికి బదిలీ చేసింది. అందులో ములుగు జిల్లాలోని 115.09 ఎకరాల ఎసైన్డ్ భూమికి పరిహారంలో ఆలస్యం జరిగింది. పరిహారం చెల్లించేందుకు రూ.15 కోట్లు అందుబాటులో ఉన్నప్పటికి సాంకేతిక కారణాలతో జాప్యం జరిగింది. గిరిజన వర్సిటీ ఏర్పాటుకు గుర్తించిన భూమి తొలుత భూపాలపల్లి జిల్లా పరిధిలో ఉండేది. పునర్విభజన తరువాత ములుగు జిల్లా కిందకు వచ్చింది. ఈ కారణాల వల్లే నిధుల బదిలీ, పంపిణీలో ఆలస్యం అయింది.
Sammakka Sarakka University Seats : రాష్ట్రానికి చెందిన గిరిజనులకు కేంద్రీయ వర్సిటీలో ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వాలని తెలంగాణ గిరిజన సంక్షేమశాఖ(Department of Tribal Welfare) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కేంద్రీయ యూనివర్సిటీ ప్రవేశాల్లో ప్రత్యేక స్థానిక రిజర్వేషన్లు లేవని ఇప్పటికే కేంద్ర వర్గాలు తెలిపాయి. ఐదేళ్ల పాటు రాష్ట్ర గిరిజన విద్యార్థులకు ప్రత్యేక కోటాను ఏర్పాటు చేసే విధంగా మంత్రిమండలి దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది. దీనిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ రకమైన వర్సిటీలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారానే అడ్మిషన్లు ఉంటాయని గిరిజన సంక్షేమ వర్గాలు పేర్కొన్నాయి. ఆధునిక కోర్సులతో పాటు గిరిజన ఆచారాల పరిశోధనలు, కేంద్రీకృత విద్య ప్రోత్సహించేలా ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టనున్నారు.
'రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డు' ప్రకటించిన ప్రధాని
గిరిజన విశ్వవిద్యాలయానికి మోక్షం వచ్చేను.. అన్నీ అనుకూలతలే..