కాకతీయుల కళావైభవానికి ప్రతీకయినా ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కడంపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. యునెస్కో గుర్తింపు తనకెంతో సంతోషాన్నిచ్చిందన్నారు. దేశం, తెలంగాణ ప్రజల తరఫున ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కిషన్‌రెడ్డి చెప్పారు.
ఇదీచూడండి: RAMAPPA TEMPLE UNESCO: రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు
హైదరాబాద్ సైతం ఆ జాబితాలో చేరాలి..
రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తించడంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. 800 ఏళ్ల చరిత్ర కలిగిన కాకతీయ రుద్రేశ్వర ఆలయానికి గుర్తింపురావడం సంతోషకరమన్నారు. ఇందుకోసం కృషిచేసిన అందరికీ అభినందనలు తెలియజేశారు. మన రామప్ప ప్రపంచంలోనే మొట్టమొదటి చరిత్రాత్మక ప్రదేశమని.. కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ సైతం ఆ జాబితాలో చేరాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
యునెస్కో స్థాయిలో మరో పది స్థలాలున్నాయ్!
తెలంగాణ చారిత్రక కళా వైభవాన్ని చాటి చెప్పే రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ గుర్తింపు రావడాన్ని పండుగల జరుపుకోవాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రపంచ వారసత్వ స్థలంగా రామప్ప గుర్తింపు దక్కడంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి... ప్రభుత్వం, అధికారులు, ప్రజల కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. కాకతీయుల కాలం నుంచే తెలంగాణ చారిత్రక వైభవం ఎంతో ఘనమైనదని.. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ప్రపంచ గుర్తింపు రావడం ఇంత ఆలస్యమైందన్నారు. స్వరాష్ట్ర సాధనతోనే తెలంగాణ చారిత్రక కట్టడాలు, సంపద, సంప్రదాయలకు గుర్తింపని నాడు కేసీఆర్ నమ్మిన మాట నిజమైందన్నారు. రాష్ట్రంలో మరో 10 చారిత్రక ప్రాంతాలకు ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చేలా కృషి చేస్తామని మంత్రి తెలిపారు.
సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపారు: ఎర్రబెల్లి
రామప్పకు యునెస్కో గుర్తింపు దక్కడం.. తెలుగు జాతికే గర్వకారణమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రామప్ప అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని చెప్పారు. యునెస్కో గుర్తింపు కోసం సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపారన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
గుర్తింపు వెనుక ప్రధాని సహకారం: సంజయ్
చారిత్రక రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా లభించడం హర్షనీయమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఆశీస్సులు, సహాయ సహకారాలతోనే సాధ్యమైందన్నారు. రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు కృషిచేసిన ప్రధాని మోదీ, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి మీనాక్షి లేఖికి అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మొదటి బహుమతిగా భావిస్తున్నట్లు సంజయ్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఇలాంటి మరెన్నో అవకాశాలను కిషన్‌రెడ్డి.. తెలంగాణకు కల్పిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం వల్ల తెలంగాణలో పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందడం సహా ప్రపంచ వ్యాప్తంగా గొప్ప ఖ్యాతి గడిస్తుందని పేర్కొన్నారు.