రామప్ప దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో గణపతి దేవుడుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కట్టించాడు. 40 ఏళ్ల పాటు శ్రమించి ఈ దేవాలయాన్ని నిర్మించారు. సాధారణంగా ఆలయంలో ఉన్న దేవుడి పేరు మీదుగా గుడి పేరు ఉంటుంది. కానీ రామప్ప దేవాలయం దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండటం ఇక్కడి విశేషం. ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయంలో ప్రధాన దైవం రామలింగేశ్వరుడు. ఈ ఆలయం తూర్పు దిశాభిముఖంగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగాన మూడు వైపుల ప్రవేశ ద్వారంతో కలిగి మహామండపం ఉంది. గర్భాలయంలో ఎత్తైన పీఠంపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగం ఉంటుంది.
శిల్ప కళలు
ఆలయ మహామండపం మధ్య భాగాన కల కుడ్య స్తంభాలు, వాటిపై గల రాతి దూలాలు రామాయణ, పురాణ, ఇతిహాస గాథలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పాలు కలిగి ఉన్నాయి. ఈ మహామండపం వెలుపలి అంచున పైకప్పు కింది భాగాన నల్లని నునుపు రాతి పలకంపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరంగా చెక్కబడిన మదనిక, నాగిని శిల్పాలు కాకతీయుల శిల్పకళాభిరుచులకు చక్కటి తార్కాణాలుగా నిలిచాయి. ఈ దేవాలయ ప్రాంగణంలో ఇతర కట్టడాలలో నంది మండపం, కామేశ్వర, కాటేశ్వర మొదలగు ఆలయాలు చూడదగినవి. రామప్ప ఆలయాన్ని అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మించారు. ఈ ఇటుకలు నీటి మీద తేలే అంత తేలికైనవి అని చెబుతారు. ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఏ దిశనుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది. ఆలయ నిర్మాణానికి నల్ల డోలోమైట్, గ్రానైట్, శాండ్‌స్టోన్‌ను వినియోగించారు. ఆలయం చుట్టూ ఉన్న మదనికలు కాకతీయ అద్భుత శిల్పకళా చాతుర్యానికి ప్రతీకలు.
పర్యాటక ప్రాంతం
మహోత్కృష్టమైన శిల్ప ఖండాలు ఈ ఆలయంలో కోకొల్లలు. గంటలు కాదు... రోజుల తరబడి చూసినా తనివితీరని అపురూప ఆకృతులకు ఈ ఆలయం పెట్టింది పేరు. ఆలయాన్ని అనుకుని ఉన్న రామప్ప చెరువు అందాలు.. పర్యాటకులను కట్టిపడేస్తాయి. బోటింగ్ సదుపాయం కూడా ఉండటంతో.. పర్యాటకులకు ఈ ప్రాంతం స్వర్గ ధామమే. శతాబ్దాల నుంచి లక్షల సంఖ్యలో పర్యాటకుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్న ఈ ఆలయ విశిష్టత గురించి ఎంత సేపు చెప్పుకున్నా తనివి తీరదు. అలాంటి ఈ అద్భుత ఆలయానికి నేడు అపురూప గుర్తింపు లభించింది.
ఇలా వెళ్లొచ్చు...
ములుగు జిల్లాలో వెంకటాపురం మండలం పాలెంపేట గ్రామంలో పచ్చని పంట పొలాల నడుమ... రామప్ప ఆలయం కొలువై ఉంది. ఇక్కడి రోడ్డు మార్గం ద్వారా వెళ్లవచ్చు. వరంగల్ వరకు రైలు, రోడ్డు మార్గం ద్వారా చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రామప్పకు చేరుకోవచ్చు. రామప్ప వరంగల్ నగరానికి దాదాపు 66 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్(Hyderabad to Ramappa temple) నుంచి రైలు లేదా రోడ్డు మార్గం ద్వారా వరంగల్ చేరుకుని అక్కడి నుంచి రామప్ప చెరుకోవచ్చు. రామప్పకు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు కూడా వెళ్తాయి.
ఇదీ చదవండి: కాకతీయ శిల్పకళా నైపుణ్యం దేశంలోనే ప్రత్యేకమైంది: సీఎం కేసీఆర్
కాకతీయ వారసత్వానికి ప్రతీక రామప్ప ఆలయం: ప్రధాని
RAMAPPA TEMPLE UNESCO: రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు