Rahul Gandhi Speech at Mulugu Congress Public Meeting : రామప్ప వంటి సుందరమైన ఆలయాన్ని ఇప్పటి వరకూ తాను చూడలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. 2004లో కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రం ఇస్తామని హామీ ఇచ్చిందని.. ఆ హామీని పార్టీ ఎలా సాకారం చేసిందో ప్రపంచమంతా చూసిందని గుర్తు చేశారు. కేసీఆర్ గతంలో ఎన్నో హామీలు ఇచ్చారని.. దళితులకు కేసీఆర్ 3 ఎకరాల పొలం ఇస్తామన్నారని.. ఇచ్చారా అని ప్రశ్నించారు. ములుగు జిల్లా రామానుజపురంలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో (Congress Public Meeting) ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Rahul Gandhi Fires on KCR : ఇంటికో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ (KCR) హామీ ఇచ్చారని.. ఉద్యోగాలు ఇచ్చారని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రశ్నించారు. అవినీతిరహిత పాలన అందిస్తామన్నారని.. అవినీతి చేశారా లేదా? అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోనే కేసీఆర్ రూ.లక్ష కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామన్నారని.. ఎంతమందికి ఇచ్చారు? అని అడిగారు. లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారని.. ఎంతమందికి రుణమాఫీ చేశారు? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
Rahul Gandhi Khammam Meeting Speech : 'కర్ణాటక తరహాలో.. తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరుతాం'
Rahul Gandhi Started Election Campaign from Mulugu District : కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలన్నీ తాము నెరవేర్చామని రాహుల్ గాంధీ అన్నారు. రాజస్థాన్‌లో అందరికీ ఉచిత వైద్యం ఇస్తామన్నామని.. దానిని అమలు చేసి చూపినట్లు పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలో రూ.25 లక్షల వరకూ ఉచితంగానే వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. ఉచిత వైద్యం.. దేశంలో రాజస్థాన్‌లోనే అద్భుతంగా ఉందని వివరించారు. ఛత్తీస్‌గఢ్‌లో ధాన్యం రూ.2500కు కొంటామని చెప్పి.. చేసి చూపించామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
Telangana Assembly Elections 2023 : దేశంలోనే వరిధాన్యం కొనుగోలు ధర ఛత్తీస్‌గఢ్‌లోనే ఎక్కువని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కర్ణాటకలో ఇచ్చిన ఐదు గ్యారెంటీలను మొదటి రోజే అమలు చేసి చూపించామని అన్నారు. కర్ణాటక వెళ్లి చూడండని.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని.. ప్రతినెలా మహిళలకు వారి అకౌంట్‌లోకి ఉచితంగా డబ్బు వస్తోందని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని రాహుల్ గాంధీ తెలిపారు.
Telangana Assembly Elections 2023 : గిరిజన వాసులకు మాట ఇస్తున్నానని.. మీ భూములపై మీకు హక్కు కల్పిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. పోడు భూములైనా..అసైన్డ్ భూములైనా.. మీ భూమిపై మీకు హక్కు కల్పించనున్నట్లు చెప్పారు. తాము దిల్లీలో అధికారంలో ఉన్నప్పుడు ట్రైబల్ బిల్లు తామే తీసుకొచ్చామని గుర్తుచేశారు. ఇందిరమ్మ పథకం కింద రూ. 5లక్షలు ఇవ్వబోతున్నట్లు.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి 250 గజాలు ఇంటి స్థలం ఇస్తామని రాహుల్ గాంధీ వివరించారు.
అభయహస్తం పింఛను పెంచి రూ.4000 ఇవ్వబోతున్నామని రాహుల్ గాంధీ తెలిపారు. యువవికాసం కింద యువతీయువకులకు రూ.5 లక్షల వరకూ ఇవ్వబోతున్నట్లు చెప్పారు. సమ్మక్క సారక్క జాతరను జాతీయ ఉత్సవంగా నిర్వహిస్తామని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ, భారత్ రాష్ట్ర సమితి కలిసి పని చేస్తున్నాయని ఆరోపించారు. కమలం పార్టీ ఇప్పటికే రాష్ట్రంలో చిరునామా కోల్పోయిందని రాహుల్ గాంధీ విమర్శించారు.
Rahul Gandhi Comments on BRS and BJP : బీఆర్ఎస్ (BRS) గెలవాలని.. బీజేపీ కోరుకుంటోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కమలం పార్టీ, భారత్ రాష్ట్ర సమితితో కలిసి పని చేస్తున్నాయని.. వాటితో ఎంఐఎం కూడా కలిసి ఉందని విమర్శించారు. పార్లమెంట్‌లో భారతీయ జనతా పార్టీ ప్రవేశ పెట్టిన అన్ని బిల్లులకు.. బీఆర్ఎస్ మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు.. ఆ మూడు పార్టీ మిలాఖత్ అయ్యాయని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు.
కేసీఆర్‌పై సీబీఐ, ఈడీ, ఐటీ కేసులు ఏమీ ఉండవని.. ఇదే బీఆర్ఎస్, బీజేపీ (BJP) మిలాఖత్‌కు సాక్ష్యమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తనను కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాలుగా వేధించిందని.. కానీ కేసీఆర్‌పై మాత్రం ఒక్క కేసు కూడా ఉండదని ధ్వజమెత్తారు. మీరు భారత్ రాష్ట్ర సమితికి ఓటేస్తే.. భారతీయ జనతా పార్టీకి ఓటేసినట్లేనని ఆరోపించారు. కమలం పార్టీతో కాంగ్రెస్‌ది సైద్ధాంతిక పోరాటమని.. సిద్ధాంతాల విషయంలో ఆ పార్టీతో రాజీపడే ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌కు పూర్తిగా మద్ధతు ఇవ్వండి.. మేం బీజేపీని ఓడిస్తాం. కేవలం తెలంగాణలోనే కాదు.. దేశమంతా బీజేపీని ఓడిస్తాం. కర్ణాటక, హిమాచల్‌లో బీజేపీలో ఓడించాం. రేపు తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలోనూ బీజేపీని ఓడిస్తాం. బీజేపీ బీటీమ్ అయిన బీఆర్ఎస్‌ను ఓడించడం ఇప్పుడు చాలా అవసరం. - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత