mla seethakka on go 317: స్థానికత కోసమే పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం చెలగామాడుతోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. తక్షణమే 317 జీవోను రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. స్థానికత ఆధారంగానే బదిలీలు, నియామకాలు చేపట్టాలని ములుగు జిల్లాకేంద్రంలో పెద్దఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఉద్యోగ సంఘాలతో చర్చించి అందరికీ ఆమోద యోగ్యమైన బదిలీలను చేపట్టాలని కోరారు. స్థానికత ఆధారంగా ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. ఇలాంటి జీవోలతో ఉద్యోగులు స్థానికతను కోల్పోయే అవకాశం ఉందన్నారు. ములుగు, వెంకటాపూర్ మండలాల కార్యకర్తలతో కలిసి జాతీయ రహదారిపై బైఠాయించారు.
స్థానికత కోల్పోయే ప్రమాదం
ఉద్యోగుల బదిలీ ప్రక్రియలో సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకోవాలని సీతక్క విజ్ఞప్తి చేశారు. 317 జీవో వాళ్ల స్థానికతను కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ పోరాటానికి మూల సిద్ధాంతమైన స్థానికతను మరిచిపోయారని విమర్శించారు. సకల జనుల సమ్మె, మానవహారం, సహాయ నిరాకరణ లాంటి వీరోచిత పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్న ఉద్యోగులను పక్కకు పెట్టడం దురదృష్టకరమని వాపోయారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు బకాయి ఉన్న నాలుగు డీఏలను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సీపీఎస్‌ను రద్దు పరిచి పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తేవాలని.. ఉద్యోగ ఉపాధ్యాయులకు తిరిగి వారి వారి స్థానిక జిల్లాల్లో అవకాశం కల్పించాలని కోరారు. ఇది కేవలం ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్య కాదని.. భవిష్యత్తులో నిరుద్యోగులకు అవకాశం రావాలంటే వెంటనే ప్రభుత్వం 317 జీవోను రద్దు చేసి స్థానికత ఆధారంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రక్రియ చేపట్టాలని కోరారు. స్పౌజ్ బదిలీలు అన్ని జిల్లాలకు వర్తింప చేయాలని సీతక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి రవళి రెడ్డి, జిల్లా అధ్యక్షులు నల్లేల కుమారస్వామి,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవిచందర్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే తెరాస నాయకులు రైతు సంబురాలు చేసుకుంటున్నారు. ఉద్యోగ బదిలీల విషయంలో కూడా ఆత్మహత్యలు చేసుకోవడం ఇదే మొదటిసారి. ఉద్యోగులను చిందర వందరగా బదిలీ చేస్తే ప్రభుత్వానికి ఏం లాభం. స్థానికత కోసమే తెలంగాణ సాధించుకున్నాం. అలాంటిది ఉద్యోగుల బదిలీలు స్థానిక ఆధారంగానే జరగాలి. ఉద్యోగ నియామకాలు కూడా స్థానికత ఆధారంగానే చేపట్టాలి. ఉద్యోగుల పోరాట ఫలితంగానే తెలంగాణ వచ్చింది. సొంత జిల్లాకు బదిలీ చేయకుండా ఎక్కడికో బదిలీ చేయాల్సిన అవసరమేముంది. ఎజెన్సీ ప్రాంతాల్లో జూనియర్లను పంపిస్తే మళ్లీ నియామకాలు జరగవు. మరో 25 ఏళ్ల వరకు ఉద్యోగాలు రావు. అందువలన స్థానికత, సీనియరిటీ ప్రకారం బదిలీలు చేపట్టండి. ఉద్యోగులను సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అయితే జీవో 317ను రద్దు చేయాలి. - సీతక్క, ములుగు ఎమ్మెల్యే
ఇవీ చూడండి: