ములుగు జిల్లా ప్రజలు ముద్ర రుణాలను సద్వినియోగం చేసుకొని, మహిళలు ఆర్థికంగా ఎదగాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిణి పారిజాతం అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ఎల్డీఎం ఆంజనేయులుతో కలిసి ముద్ర రుణ మేళా నిర్వహించారు. కలెక్టర్ ఆదేశానుసారం మంగళవారం.. ములుగు, వెంకటాపూర్ మండలాలకు చెందిన ఎస్బీఐ, యూబీఐ, కెనరా బ్యాంకు అధికారులతో ముద్ర రుణ దరఖాస్తుల స్వీకరణ చేపట్టినట్లు పారిజాతం తెలిపారు. బుధవారం ఈ రెండు మండలాలకు సంబంధించి ఏపీజీవీబీ బ్యాంకు అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తారని వెల్లడించారు.
చిరు వ్యాపారుల కోసం
జిల్లాలో మున్సిపాలిటీలు లేనందున చిన్న వ్యాపారస్థులు, వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ రుణ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారిణి చెప్పారు. రూ. 10 వేల నుంచి వ్యాపారానికి తగినట్టుగా రుణం మంజూరు చేస్తామని ఆమె అన్నారు. ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు, వ్యాపార స్థలం వివరాలు, ముద్ర రుణ దరఖాస్తు ఫారంతో దరఖాస్తు చేయాలని, ఎటువంటి రుసుములు ఉండవని పేర్కొన్నారు. ఈ రుణాన్ని ఐదేళ్లలో తిరిగి చెల్లించవచ్చని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత బ్యాంకు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అభివృద్ధి రాజకీయం కావాలా?.. విభజనవాదం కావాలా?: కేటీఆర్