ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి కరోనా నిర్ధరణ అయ్యింది. గత కొద్ది రోజుల క్రితం అతను హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో క్యాన్సర్‌కు చికిత్స చేయించుకుని డిచ్ఛార్జ్ అయ్యాడని వైద్యులు తెలిపారు. కాగా కొద్దిరోజుల క్రితం అతను అనారోగ్యంతో జిల్లా ఏరియా ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత మరల అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు ఆ వ్యక్తికి వైరస్ పాజిటివ్ ఉన్నట్టు వెల్లడించారు. వెంటనే అతన్ని జిల్లా వైద్యాధికారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు.
అప్రమత్తమైన అధికారులు బాధితుడి ప్రైమరీ కాంటాక్ట్‌ని క్వారంటైన్‌కి తరలించారు. అతని కుటుంబ సభ్యుల నమూనాలు సేకరించి పరీక్ష చేయించగా వారిలో ఇద్దరికి కరోనా నిర్ధరణ అయ్యింది. వారిని ఐసోలేషన్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఏరియా ఆసుపత్రిలో బాధితుడికి చికిత్స అందించిన వైద్య సిబ్బంది నమూనాలను సేకరించి పరీక్షకు తరలించారు. వారిలో నలుగురికి పాజిటివ్ అని తేలడం వల్ల జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై శానిటేషన్ చేస్తున్నారు. ఆ గ్రామాన్ని నిర్బంధించి ప్రజలను బయటకు రావద్దని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: కరోనా మానసిక ఆందోళనను ఇలా జయించండి