వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ములుగులో నిర్వహించారు. దీనిలో భాగంగా మొదట ములుగులోని గట్టమ్మ అమ్మవారిని దర్శించుకుని తెరాస పార్టీ జిల్లా కార్యాలయ పనులను మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాఠోడ్ పరిశీలించారు. అనంతరం లీలా గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ మాలోతు కవిత, జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీష్ పాల్గొన్నారు.
ఇంట్లో పెళ్లి పనులు చేసినంత శ్రద్ధగా ఓటరు నమోదు కార్యక్రమం చేయాలని ఎంపీ మాలోతు కవిత సూచించారు. ప్రతిపక్షాలకు సరైన బుద్ది చెప్పే విధంగా ఈ ఫలితాలు ఉండాలన్నది సీఎం కేసిఆర్ ఆలోచనని ఆమె తెలిపారు. గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అంటే కనపడక పోయేదని.. కానీ మన ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి నిత్యం మనతో ఉన్నారని మంత్రి సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. ములుగు జిల్లా ఆఖరి ఆయకట్టు వరకు నీరు ఇచ్చి జిల్లాను సస్య శ్యామలం చేసే బాధ్యత తమదని ఎర్రబెల్లి మాటిచ్చారు. అందరం కలిసి కట్టుగా పని చేద్దామని, అన్ని వర్గాలకు మేలు చేద్దామని తెలిపారు.
ఇదీ చూడండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించి హెచ్చరిక పంపాలి: జానారెడ్డి