కరోనా మహమ్మారి కష్టజీవుల బతుకులను దుర్భరం చేసిన వేళ.... ఎంతో మందికి పూటగడవటమే కష్టంగా మారింది. అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసీలు మరింత దయనీయ స్థితిలో జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అడవి బిడ్డల ఆశాదీపంగా.... వారి ఆకలితీర్చేందుకు నిరంతరం పరితపిస్తోంది.... ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ అలియాస్ సీతక్క.
లాక్‌డౌన్ కారణంగా తన నియోజకవర్గంలో తిప్పలు పడుతున్న ప్రజల కోసం ఆమె చేస్తున్న కృషి.... ప్రజాప్రతినిధి అన్న పదానికి సరైన నిర్వచనంగా నిలుస్తోంది. మండుటెండను సైతం లెక్కచేయకుండా.... కొండలు, కోనల్లో కాలినడకన, ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లలో గిరిజన ప్రాంతాలకు వెళ్తూ.... నిత్యావసర సరకులను అందిస్తున్నారు. రాత్రింబవళ్లు గుత్తికోయల గూడాల్లో పర్యటిస్తూ... ప్రజల్లో భరోసా నింపుతున్నారు.
320 గ్రామాల్లో పర్యటన
ములుగు నియోజకవర్గంలో 7వందలకు పైగా పల్లెలుండగా.... ఇప్పటి వరకు 320 గ్రామాల్లో పర్యటించిన.... సీతక్క అందరికీ నిత్యావసరాలు అందజేశారు. ఆదివాసీలకు బియ్యం, కూరగాయలు, నూనె, పప్పుదినుసులు ఇలా 15 రోజులకు సరిపడేలా పంపిణీచేస్తున్నారు. రవాణా సౌకర్యం సరిగాలేని గిరిజన ప్రాంతాలకు సరకులను ఎడ్ల బండ్లలో, ట్రాక్టర్లలో, అవసరమైతే భుజాల మీద మోస్తూ తీసుకువెళ్లి, ప్రజలకు అందిస్తున్నారు.
కరోనా పట్ల అవగాహన తక్కువగా ఉండే గిరిజనగూడాల్లో.... వైరస్ వ్యాప్తిపై తెలియజేస్తూ.... మాస్కులు పంపిణీ చేస్తున్నారు. చిన్నపిల్లలు, మహిళలకు పౌష్ఠికాహారం, అప్రమత్త చర్యలను తెలియజేస్తున్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటిస్తున్న క్రమంలో... ఆమె నిరాడంబరత, పేదలపై చూపించే ఆప్యాయత ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. గిరిజనగ్రామాల పర్యటనలో చెలిమల్లో దప్పిక తీర్చుకుంటూ.... అడవుల్లోనే సేదతీరుతున్నారు.
'గో హంగర్ గో' పేరుతో ఛాలెంజ్
లాక్‌డౌన్ దృష్ట్యా పేదల ఆకలి తీర్చేందుకు వినూత్న సవాల్‌ను సీతక్క ప్రారంభించారు. 'గో హంగర్ గో' పేరుతో ఛాలెంజ్‌ను ఏర్పాటు చేసి.... ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇందులో భాగంగా.... గవర్నర్ తమిళిసై, ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్‌అలీకి ఆమె సవాల్ విసిరారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ సీతక్క చేస్తున్న సాహసం, సేవపై నెట్టింట్లో ప్రశంసలు వర్షం కురుస్తోంది. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఆమె సేవలను.... తెలుగు రాష్ట్రాల ప్రజలు కొనియాడుతున్నారు.
ఇవీచూడండి: కరోనా కేసులు తగ్గుముఖం.. 12 జిల్లాల్లో జాడలేదు