అడవుల్లో ఎక్కడ గిరిజనులు ఉన్నా ఆదుకోవడానికి నేనున్నానంటూ ఎల్లప్పుడు పరితపించే హృదయం ఆ మాతృమూర్తి. కనీస అవసరాలకు నోచుకోలేని అడవి బిడ్డలకు అన్ని తానై ఆదరిస్తుంది. పండగరోజు వారితో ఉంటేనే తనకు నిజమైన పండుగలా భావిస్తుంది కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.
దీపావళి పర్వదినాన ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఎజెన్సీ గ్రామాల్లోని గిరిజనులకు ఎమ్మెల్యే సీతక్క నిత్యావసరాలు పంపిణీ చేశారు. రాబిన్ ఉడ్ ఆర్మీ సహకారంతో పోచాపురం, అల్లిగూడెం, నర్సాపూర్, బొల్లాపల్లి గిరిజనులకు సాయమందించారు. కనీస రోడ్డు సౌకర్యాలు లేని వారి వద్దకు కిలోమీటర్ల మేర సరుకులు మోస్తూ వెళ్లి నర్సాపూర్ ఆదివాసీలకు దుప్పట్లు, చీరలు అందజేశారు.
రెండువందల గిరిజన కుటుంబాలకు బియ్యంతో పాటు నిత్యావసరాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన రాబిన్ ఉడ్ ఆర్మీ ఫౌండేషన్ వారికి ఎమ్మెల్యే సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. ఎజెన్సీ గ్రామాల్లో డీగ్రీలు, పీజీలు చదివినవారు ఉన్నారని...వారికి హైదరాబాద్‌లో ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేయాలని ఫౌండేషన్ నిర్వాహకులకు సీతక్క విజ్ఞప్తి చేశారు.