పండుగ పూట పేదింటి ఆడబిడ్డ బాధపడకూడదని బతుకమ్మ చీరలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోందని గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో ఆమె బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డల కష్టం తెలిసిన మనిషని కొనియాడారు. తొలిసారిగా జిల్లాకు వచ్చిన ఆమెకు తెరాస నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నారాయణరెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్యే సీతక్క, జడ్పీ ఛైర్మన్ జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.
ముందుగా మంత్రి మేడారం సమ్మక్క- సారలమ్మలను దర్శించుకొని అమ్మవార్లకు చీరలు సమర్పించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ములుగు కేంద్రంలోని లీలా గార్డెన్‌లో జరిగిన సభలో పాల్గొన్నారు. గిరిజన మహిళగా ఏజెన్సీ జిల్లా ములుగును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుండటం సంతోషకరమని కార్యక్రమానికి హాజరైన మహబూబాబాద్ ఎంపీ కవిత అన్నారు. సీతక్క ఎంతో సున్నితమైన వ్యక్తి అని, తెరాస పార్టీలోకి రావాలని ఆహ్వానించారు కవిత. బతుకమ్మ పండుగకు శాస్త్రీయత ఉందని, పూర్వీకులు మనకిచ్చిన ఈ పరంపరను కొనసాగించాలని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.
ఇవీ చూడండి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ