మేడారం జాతర విశ్వ వ్యాప్తం చేసేందుకు అధికార యంత్రాంగం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ములుగు కలెక్టర్ నారాయణరెడ్డి సరికొత్త ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. కలెక్టర్ కార్యాలయానికి జిల్లా నలుమూలల నుంచి నిత్యం వందలాది మంది వస్తూ పోతూ ఉంటారు. వారిని ఆకర్షించేందుకు మేడారం జాతర దృశ్యాలను కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రజలు ఎడ్ల బండ్లపై ఎక్కి జాతరకి వెళ్లే దృశ్యాలు మొదలుకొని సమ్మక్క, సారలమ్మ గద్దెలు, గిరిజనుల ఆచార సంప్రదాయాలు, ఎత్తు బంగారం, ఎదురు కోళ్లు, గిరిజన నృత్యాలు, పిల్లాపాపలతో భుజానికెత్తుకుని కాలినడకన జాతరకు వెళ్ళడం మొదలగు చిత్రాలు కలెక్టర్ కార్యాలయ ప్రహరీ గోడపై రంగు రంగులతో దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి పది మంది చిత్రకారులు మూడు రోజులుగా శ్రమించి వీటిని వేస్తున్నారు. మరో పది రోజుల వరకు రహదారిపై సుమారు వందకు పైగా చిత్రాలు గీసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
ఇవీ చూడండి: బెంగళూరులో వస్త్ర పరిశ్రమల ప్రతినిధులతో కేటీఆర్ భేటీ