మేడారం జాతర దగ్గరపడుతున్న వేళ ఏర్పాట్లు శరవేగంగా పూర్తవుతున్నాయి. సీఎస్ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పనుల పురోగతిని సమీక్షించారు. జంపన్నవాగు, చిలకలగుట్ట, పార్కింగ్, బస్ స్టాండ్, ఊరట్టం రోడ్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. జాతరలో ఏర్పాట్లపై రూపొందించిన మ్యాప్‌ను పరిశీలించారు. అనంతరం శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. పనులు ఎంత శాతం పూర్తయ్యాయో తెలుసుకున్నారు.
అధికారులకు సీఎస్ ఆదేశం
జాతరకు చేరుకునే రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులు పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. జీపీఎస్ ట్యాగింగ్ ద్వారా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. పార్కింగ్ కేంద్రాల్లో పక్కా సమాచారంతో బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతిరోజూ టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పనుల పురోగతి సమీక్షించాలని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులకు తెలిపారు.
ఆచూకీ వెంటనే తెలుసుకునేలా
సీఎస్‌తో పాటు మేడారం వెళ్లిన డీజీపీ మహేందర్ రెడ్డి భద్రతాపరమైన ఏర్పాట్లు పరిశీలించారు. పరస్పర సహకారంతో జాతరను సమర్థంగా నిర్వర్తించాలని పోలీసు అధికారులకు సూచించారు. జాతరలో తప్పిపోయిన వారి ఆచూకీ వెంటనే తెలుసుకునేలా పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
ఇక్కట్లు పడుతున్నారు...
జాతర ఏర్పాట్లలో లోపాలను ఎమ్మెల్యే సీతక్క.. సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. నిర్మాణం పూర్తైనా మరుగుదొడ్లు అందుబాటులోకి తేకపోవడం వల్ల మహిళలు ఇక్కట్లు పడుతున్నారని వివరించారు. ఎమ్మెల్యే పేర్కొన్న అంశాలపై తక్షణమే దృష్టి సారించాలని సీఎస్ అధికారులను కోరారు.
పదిహేను రోజుల ముందే జాతర సందడి మొదలైంది. భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఇదీ చూడండి : 'ఓటర్లను మంత్రి ఎర్రబెల్లి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు'