Medaram Jatara 2022 : తెలంగాణ కుంభమేళాగా పేరొందిన సమ్మక్క సారలమ్మ జాతరకు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయలకు నెలవైన సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా... గత బుధవారం నాడు గుడిమెలిగే పండుగను జరపించి జాతరకు అంకురార్పణ చేసిన పూజారులు... ఇవాళ మండమెలిగే ఘనంగా నిర్వహించారు. మండ మెలిగే పండుగతో జాతర ప్రారంభమైనట్లుగా ఆదివాసీలు భావిస్తారు.
రాత్రి సమయంలో దర్శనం నిలిపివేత..
వేకువజామునే లేచి పూజారులు ఆలయాలను శుద్ధి చేసి... ముగ్గులు వేశారు. డోలు వాయిద్యాల నడుమ... మేడారం పరిసరాల్లో పూజారులు, గ్రామస్థులు....పసుపు కుంకాలతో పూజలు చేసి... దిష్టి తోరణాలు కట్టారు. ఇలా చేయడం వల్ల దుష్టశక్తులు తమ గ్రామాల్లోకి రావని విశ్వసిస్తారు. రాత్రి సమయంలో గద్దెల వద్ద అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించి జాగారాలు చేయనున్నారు. ఇందుకోసం రాత్రి సమయంలో దర్శనాలను నిలిపివేయనున్నారు. వచ్చే బుధవారం సాయంత్రం... సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపైకి తీసుకురావడంతో... మహా జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమవనుంది.
భారీగా తరలివస్తున్న భక్తులు..
మేడారంలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్ర నలుమూలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. కుటుంబసమేతంగా వచ్చిన భక్తులు జంపన్నవాగులో స్నానాలు చేసి వనదేవతలను దర్శించుకుంటున్నారు.
ఇదీ చూడండి : వేములవాడ ఆలయంలో కోడె హల్చల్.. చలువ పందిరి ఎక్కి!