Luxury Tents At Medaram : మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ఈనెల 16 నుంచి 19 వరకు జరగనుంది. ఇప్పటికే భారీ ఎత్తున తరలివస్తున్న భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. జనం పెద్ద సంఖ్యలో వనం బాట పట్టడంతో మేడారం పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అమ్మవార్ల దర్శనానికొచ్చే భక్తులు చెట్ల నీడన, చిన్నచిన్న గుడారాలు వేసుకుని వసతి ఏర్పాటు చేసుకుంటారు. అయితే కొందరు భక్తులకు సరైన వసతి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఆ బాధలు పడాల్సిన అవసరం లేదంటోంది మేడారంలోని హరిత హోటల్. మేడారం వచ్చే భక్తులకు లగ్జరీ టెంట్లను అందుబాటులోకి తెచ్చారు.
అన్ని హంగులతో..
మేడారం హరిత హోటల్లో ఇప్పటికే ఏసీ, నాన్ ఏసీ గదులున్నాయి. జాతర సందర్భంగా ప్రత్యేకంగా 25 టెంట్లు అందుబాటులోకి తెచ్చారు. సకల సౌకర్యాలతో అన్ని హంగులతో ఈ ఆధునిక గుడారాలు భక్తులను గ్రీన్ కార్పెట్‌తో ఆహ్వానిస్తున్నాయి. ముందుగా వరండాలో ఆరామ్ కుర్చీలు ఉంటాయి. ఒక అడుగు ముందుకేసి టెంట్‌లోకి వెళ్లగానే రెండు మంచాలు, ఫ్యాను, కూర్చోడానికి కుర్చీలు, టేబుళ్లు ఉంటాయి. విద్యుత్తు దీపాల అలంకరణతో గదంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. పక్కనే వాష్‌రూం కూడా ఉంటుంది. వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్, వాష్ బేషన్, స్నానానికి షవర్, అద్దాలు, ఇలా అన్ని సౌకర్యాలున్నాయి.
ఎలా బుక్చేసుకోవాలి...
ఇద్దరు పెద్ద వారికి, ఇద్దరు పిల్లలు ఉండేందుకు సౌకర్యవంతంగా ఉంది. అవసరమైతే అదనంగా ఉన్నా వారికి కూడా కొవిడ్ నిబంధనలు తగిన ఏర్పాట్లు చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. మేడారం హరిత గ్రాండ్ వెబ్సైట్లో ఆన్లైన్ బుకింగ్ కూడా చేసుకోవచ్చని నిర్వాహకులు అంటున్నారు. భక్తులకు సరసమైన ధరకు 22 గంటల పాటు అద్దెకు ఇస్తామని చెప్పారు. ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరుతున్నారు.
జాతర సందర్భంగా 25 టెంట్లను ఏర్పాటు చేశాము. వాటిలో ఏసీ, వాష్‌రూమ్స్ సహా అన్ని సౌకర్యాలు కల్పించాము. వాటి ధరలు కూడా అందుబాటులోనే ఉంటాయి. 22 గంటల కాలపరిమితితో వాటిని అద్దెకు ఇవ్వడం జరుగుతుంది. హరిత గ్రాండ్ మేడారం అనే వెబ్సైట్లో రూమ్‌లు బుక్ చేసుకోవచ్చు. ఒక్కో రూమ్‌లో ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలను అనుమతిస్తాము. అవసరమైతే కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మరికొందరిని అనుమతిస్తాం. - నిర్వాహకులు
ఇదీ చూడండి : Ramanuja sahasrabdi: ఈ చిన్నారులు.. చినజీయర్ స్వామినే ఆశ్చర్యపోయేలా చేశారు!