ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో ఓ గర్భిణీకి నెలలు నిండక ముందే ఇంజక్షన్ ఇచ్చి ప్రసవం చేయించారని.. పూర్తిగా నెలలు నిండని పాప ప్రసవం అయిన తర్వాత చనిపోయిందని ఆరోపిస్తూ.. బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నా నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొర్లవేడుకు చెందిన చల్ల మౌనిక గర్భిణీ. ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల శనివారం ములుగు ఏరియా ఆసుపత్రిలో చేరారు. అదే ఆసుపత్రిలో అదే పేరు గల మరో గర్భిణీ ఉండడం వల్ల ఆమె ప్రసవం కోసం ఇచ్చిన ఇంజక్షన్‌ను నర్సు నెలలు నిండని మౌనికకు ఇచ్చింది. మౌనికకు ప్రసవ నొప్పులు వచ్చి అతికష్టంగా పాపకు జన్మనిచ్చిందని, పుట్టిన పాపకు శ్వాస ఆడకపోవడం వల్ల వరంగల్ ఎంజీఎంకు తరలించాక పాప మృతి చెందిందని బాధితురాలు పేర్కొంది. నెలలు నిండని మౌనికకు ఇచ్చిన ఇంజక్షన్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతూ చావుబతుకుల్లో ఉందని కుటుంబ సభ్యులు వాపోయారు. బాధితురాలి బంధువులు ములుగు ఏరియా ముందు ధర్నా నిర్వహించారు. నెలలు నిండని మౌనికకు ఇంజక్షన్ ఇచ్చి పాప మృతికి కారకులైన వైద్యులను సస్పెండ్ చేయాలంటూ ఆందోళన చేపట్టారు.
ఇదీ చూడండి: కొత్త వాహన చట్టంపై సీపీ అవగాహన