శాంతి భద్రతలను కాపాడటంతో పాటు గిరిజనుల అభివృద్ధికి పోలీసు శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని... వరంగల్ రేంజ్ ఐజీ ప్రమోద్ కుమార్ తెలిపారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, కలిసికట్టుగా పని చేస్తేనే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. అలాగే యువత కలిసి కట్టుగా పనిచేసి సమాజ అభివృద్ధికి పాటుపడాలని పేర్కొన్నారు. ములుగు జిల్లా జాకారంలో సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయంలో నిర్వహించిన క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ క్రీడల్లో మొదటి స్థానంలో గెలుపొందిన క్రీడాకారులందరినీ ఉచితంగా రామోజీ ఫిల్మ్‌సిటీ సందర్శనకు తీసుకెళ్తానని... జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. అలాగే రెండో స్థానం పొందిన వారికి భూపాలపల్లి జిల్లాలోని బొగ్గు గనుల సందర్శనకు... మూడో స్థానంలో నిలిచిన క్రీడాకారులకు రామప్ప సందర్శనకు తీసుకెళ్తామని అన్నారు. వాలీబాల్ పోటీల్లో మొత్తం 20 జట్లు పాల్గొనగా ప్రథమ స్థానం తాడ్వాయి, ద్వితీయ స్థానం ఏటూరునాగారం, తృతీయ స్థానంలో వాజేడు జట్లు నిలిచాయి.
ఇదీ చదవండి: డబ్బు లేకుంటే ఎన్నికల్లో పోటీ చేయకూడదు: చిన్నారెడ్డి