సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు 21 రోజుల తర్వాత భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ప్రధాన గేట్లను తెరిచి మేడారం వనదేవతల దర్శనాలను గిరిజన పూజారులు ప్రారంభించారు. గత నెల జరిగిన మినీ మేడారం జాతర సమయంలో ముగ్గురు ఎండోమెంట్ అధికారులకు కరోనా సోకింది. అప్పటి నుంచి కొవిడ్ నిబంధనలతో ఆలయాన్ని మూసివేశారు.
అయినప్పటికీ భక్తులు వనదేవతలను దర్శనం చేసుకునేందుకు వచ్చి.. గేటు ముందే కొబ్బరికాయలు కొట్టి పూలు, పండ్లు, నైవేద్యాలు సమర్పించుకుని తిరిగి ఇంటి దారి పట్టే వారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని దర్శనం కల్పించేందుకు 21 రోజుల తర్వాత సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు-గోవిందరాజుల గేట్లు తెరిచారు. కరోనాను దృష్టిలో ఉంచుకుని భక్తులు మాస్కులు ధరించి అమ్మవార్లను దర్శించుకున్నారు.