ఆసియాలోనే అతిపెద్ద కుంభమేళాగా పేరొందిన మేడారం మహాజాతర ముగింపు దశకు చేరుకుంది. ఒకప్పుడు కేవలం గిరిజనులకు మాత్రమే పరిమితమైన ఈ జాతర నేడు జనజాతరగా మారి కోటి మందికి పైగా తరలి వచ్చేలా మారింది. సమ్మక్క, సారలమ్మల చల్లని చూపులు ఎల్లప్పుడు తమపై ఉండాలంటూ మెక్కులు చెల్లించుకున్న వారంతా తమ నివాస ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. భక్తులు తమ గమ్యస్థానాలకు క్షేమంగా చేరేందుకు తెలంగాణ ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేసింది .
మహారాష్ట్రకూ బస్సుల ఏర్పాటు..
ఇప్పటివరకు 12 లక్షల మందికి పైగా భక్తులను తరలించారు. చివరిరోజు రద్దీకి తగ్గట్టుగా బస్సులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రాంతాలతో పాటు మహారాష్ట్రలోని సిరోంచ ప్రాంతానికి కూడాబస్సులు అందుబాటులో ఉంచింది. జాతరకు వచ్చిన లక్షలాది మంది ఒకేసారి తిరుగుపయనం అవుతుండటం వల్ల ఆర్టీసీ చేసిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ సమావేశమై సమీక్షించారు.
జానపద గీతాలతో అవగాహన కార్యక్రమాలు
నిన్నటి వరకూ ఆలయ క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడగా... నేడు వారంతా తరలివెళ్తుండటం వల్ల ఆర్టీసీ బస్ డిపో క్యూలైన్లు రద్దీగా మారాయి. ప్రయాణికులకు సూచనలతో పాటు ఆర్టీసీలో ప్రయాణం సురక్షితమని తెలియజేస్తూ కళా జాతర బృందాలచే జానపద గీతాలతో అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
ఇవీ చూడండి: మేడారంలో వర్షం.. తడుస్తూనే భక్తుల దర్శనం