సమ్మక్క- సారలమ్మ దేవాలయం భక్తజనసంద్రంగా మారింది. అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలిరావడం వల్ల ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భక్తులు పెరుగుతుండగా.. జాతర ఏర్పాట్లను మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాఠోడ్ సమీక్షించారు. జాతర సందర్భంగా స్థానిక యాంఫీ థియేటర్ వద్ద గిరిజన సాంస్కృతిక కార్యక్రమాలను మంత్రులు ప్రారంభించారు.
ప్లాస్టిక్ రహిత జాతర..
గిరిజన సంస్క్రతి సంప్రదాయాలను ముందు తరాలకు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రులు పేర్కొన్నారు. భక్తులకు వసతి కల్పించేందుకు ఏర్పాటు చేసిన షెడ్‌లను, వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించారు. ప్లాస్టిక్ రహిత జాతర నిర్వహణలో భాగంగా వస్త్రంతో తయారు చేసిన 2 లక్షల సంచులను పంపిణీ చేశారు.
పెరుగుతున్న భక్తుల రద్దీ..
జాతర సమీపిస్తుండగా.. భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. భక్తులు తలనీలాలు సమర్పించుకొని.... జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి.... నిలువెత్తు బంగారాన్ని తల్లులకు సమర్పించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చేపట్టిన చర్యల పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. గత జాతర కంటే ఏర్పాట్లు బాగున్నాయని అభిప్రాయపడ్డారు. భారీగా వాహనాలు వచ్చినప్పటికీ.. ట్రాఫిక్ అధికారులు చేసిన ఏర్పాట్ల కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు.
రెట్టింపు ధరలు..
రెండేళ్లకు ఓసారి జరిగే జాతర కావడం వల్ల వ్యాపారులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. అనుకున్నదే తడవుగా బెల్లం, మద్యం, కొబ్బరికాయలు కోళ్లు, మేకలు ధరలు రెట్టింపు చేసి అమ్ముతున్నారు. మామూలుగా రూ. 20 ఉండే కొబ్బరికాయ మేడారంలో రూ. 60 కి చేరుకుంది. గిరిజన సంప్రదాయం ప్రకారం జరిగే జాతర కాబట్టి అమ్మవార్లకి మద్యం, మాంసం, ఆనవాయితీ. దీనిని అవకాశంగా తీసుకున్న వ్యాపారులు... ధరలను అమాంతం పెంచగా.. భక్తుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.
ఏర్పాట్లతో తప్పిన ఇబ్బందులు..
మేడారంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే 5 లక్షల మంది వరకూ భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని అధికారులు అంచనా వేశారు. అధికారులు ఏర్పాట్లు చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు.
ఇవీ చూడండి: అశ్వత్ధామరెడ్డికి నోటీసులు.. అందుకేనట!