ములుగు జిల్లాలో పులుల కదలిక, వాటి సంరక్షణకు చేపట్టాల్సిన జాగ్రత్తల గురించి కలెక్టరేట్లో అటవీశాఖ అధికారులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. జాతీయ జంతువు పులిని కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని కరీంనగర్, వరంగల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎం.జే. అక్బర్, ఫీల్డ్ డైరెక్టర్-ప్రాజెక్టు టైగర్ వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. పులి సంచరించే ప్రాంతాలపై పూర్తి పట్టు సాధించాలని పేర్కొన్నారు.
అటవీ సమీప ప్రాంతాలకు చెందిన ప్రజలను అప్రమత్తం చేయాలని, రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్లరాదనే విషయంతో పాటు పులికి హాని తలపెడితే చట్టపరంగా చర్యలుంటాయనే అంశాన్ని వారికి వివరించాలని ఆదేశించారు. పదేళ్ల తర్వాత ములుగు జిల్లాకి పులి వచ్చిందని తెలిపారు. పులుల కదలికలను కనిపెట్టడానికి అటవీ శాఖతో పాటు ఇతర శాఖల సహాయ సహకారాలు తీసుకోవాలన్నారు. శాకాహార జంతువులు వృద్ధి చేయడం.. నీటి వసతి పెంపొందించడం వంటి అంశాలు చర్చించారు.
ములుగుకు అనుసంధానమైన కవ్వాల్ టైగర్ ఆదిలాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, ఛత్తీస్గడ్, సిరొంచా ప్రాంతాల్లో పులి సంచారాన్ని అధికారులు గమనించి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. పులులు తిరిగి జిల్లాకు రావడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య తెలిపారు. పులులు ఇక్కడే వుండేలా వాటికి కావాల్సిన చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.