కరోనా వ్యాధి నేపథ్యంలో ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ వన దేవతల ఆలయాన్ని ఏడు నెలల క్రితం ప్రభుత్వ ఆదేశాల మేరకు పూజారులు మూసివేశారు. లాక్డౌన్ ముగిశాక రాష్ట్రం నలుమూలల నుంచి ఆదివారం, బుధవారం రోజుల్లో భక్తులు వచ్చి ఆలయ గేటు ముందే వన దేవతలకు పూజలు చేసి వెళ్లేవారు. కాగా ఇవాళ వనదేవతల ఆలయాన్ని భక్తుల దర్శనార్ధం పూజారులు పునఃప్రారంభించారు.
వనదేవతలైన సమ్మక్క సారలమ్మలకు భక్తులు పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, చీరలు సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. పగిడిద్దరాజు, గోవిందరాజులకు కొబ్బరికాయలు కొట్టి మనసారా దర్శనం చేసుకుంటున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో మేడారం కళకళలాడుతుంది. వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవార్ల దర్శనం చేసుకుని తరిస్తున్నారు.
ఇదీ చూడండి: మంథని గణపతి ఆలయంలో సంకట చతుర్థి ప్రత్యేక పూజలు