Devotees rush in Medaram: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో భక్తుల రద్దీ పెరిగింది. వనదేవతలను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవార్లను దర్శించుకొని మెుక్కులు చెల్లించుకున్నారు.
జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి.. వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించారు. క్యూలైన్లలో భౌతికదూరం పాటించాలని... మాస్కు ధరించాలని పోలీసులు మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. సమ్మక్క-సారలమ్మ గద్దె వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
వనంలోని దేవతలు జనంలోకి
ఆదివాసీ ఆరాధ్యదేవతలైన సమ్మక్క, సారలమ్మల మహా జాతరకు ముహుర్తం సమీపిస్తోంది. వచ్చే నెల 16 నుంచి నాలుగు రోజుల పాటు ఈ జాతర ఘనంగా జరగనుంది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు తల్లుల చెంతకు వచ్చి... ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి... జాతరకు తరలివచ్చే భక్తులకోసం ఏర్పాట్లు చేస్తోంది. మాఘ శుద్ధ పౌర్ణమి నుంచి నాలుగు రోజుల పాటు కన్నులపండువగా జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఝార్ఖండ్ నుంచి భక్తులు తరలివస్తారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయలకు నెలవైన ఈ జాతరకు వచ్చే భక్తుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది.
ఆర్టీసీ ఏర్పాట్లు
భక్తులను మేడారం జాతరకు తరలించేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలోని డిపోల నుంచి భక్తుల సౌకర్యార్థం బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. సమ్మక్క సారలమ్మ దేవాలయం వద్ద బస్టాప్ ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్టాప్‌లో దిగిన భక్తులు వనదేవతల దర్శనం చేసుకుని తిరుగుపయనం అవుతున్నారు.
జోరుగా పనులు
మేడారానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. స్నానఘట్టాలు, మరుగుదొడ్ల పనులు జోరుగా సాగుతున్నాయి. మేడారం మహా జాతరకొచ్చే భక్తులకు వసతులు కల్పిస్తామని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న ఆయన అకాల వర్షాల వల్ల ఏర్పాట్లకు కొంతమేర ఆటంకం కలిగినా సకాలంలో పూర్తయ్యేలా చర్యలు చేపట్టామని తెలిపారు. కరోనా పరిస్థితుల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వనదేవతల దర్శనానికి వచ్చే భక్తులు.. కరోనా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: మరోసారి తెరపైకి వచ్చిన మేడారం జాతరకు జాతీయ హోదా అంశం