Mulugu Gattamma temple : మేడారం మహాజాతరకు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే మేడారం పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జాతరకు ఇంకా రెండు రోజులే గడువు ఉండడంతో.... పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లులకు... చీర, సారె, ఇచ్చి పసుపు కుంకాలు పెట్టి ఎత్తు బంగారం సమర్పించుకుంటున్నారు. ఈ విధంగా మొక్కులు చెల్లించుకుంటారు. జనవరి నుంచి ఇప్పటివరకూ దాదాపు యాభై లక్షలకు పైగా భక్తులు అమ్మలను దర్శించుకున్నారు.
గట్టమ్మ ఆలయంలో కిటకిట
మేడారం జాతర వేళ... ములుగు సమీపంలోని గట్టమ్మ ఆలయం కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. సమ్మక్క-సారలమ్మల దర్శనం కోసం వచ్చే భక్తులంతా తొలుత ఇక్కడే ఆగి... గట్టమ్మ తల్లిని దర్శించుకుని పూజలు చేస్తారు. ఇక్కడ పూజలు చేసిన తర్వాతే... మేడారం జాతరకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడ తల్లిని దర్శించుకుంటే.. జాతర ప్రయాణం సురక్షితంగా జరుగుతుందన్నది భక్తుల విశ్వాసం. అందుకే గట్టమ్మ ఆలయాన్ని గేట్ వే ఆఫ్ మేడారంగా పిలుస్తారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరూ... ఇక్కడ కాసేపు ఆగి గట్టమ్మ తల్లిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో భక్తుల సంఖ్య పెరగుతుండడంతో ప్రభుత్వం కూడా గట్టమ్మ ఆలయ పరిసరాలనూ అభివృద్ధి చేస్తోంది. అధికారులు విశాలమైన పార్కింగ్ సౌకర్యం కల్పించారు. సీసీ రోడ్లు వేశారు. భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మూడున్నర కోట్ల రూపాయల వ్యయంతో... భక్తులు బస చేసేందుకు నిర్మించిన హరిత హోటల్ కూడా అందుబాటులోకి వచ్చింది. భక్తుల కోసం సీసీ కెమెరాలు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. జాతరసమయంలోనే కాకుండా ప్రతి శని, ఆదివారం, పండుగ రోజుల్లోనూ ఇక్కడ రద్దీగా ఉంటుంది.
గట్టమ్మ తల్లిదగ్గర దర్శనం చేసుకున్న తర్వాతే మేడారానికి పోతారు. ఇక్కడ ఏం మొక్కుకున్నా కూడా నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.
-మొగిలి, గట్టమ్మ ఆలయం ప్రధాన పూజారి
హైదరాబాద్ నుంచి వచ్చాం. సమ్మక్క-సారక్క తల్లిని రెండేళ్లకొకసారి దర్శించుకుంటాం. ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకుంటాం. ఏం కోరుకున్నా నెరవేరుతాయి. అందుకే ప్రతిసారి జాతరకు వస్తాం.
-భక్తులు
మేడారం వెళ్లే భక్తులందరూ గట్టమ్మను దర్శించుకున్న తర్వాతే సమ్మక్క-సారక్క దగ్గరకు వెళ్తారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలనుసారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశాం. సీసీ రోడ్డు, మరుగుదొడ్లు, సీసీ కెమెరాలు, పార్కింగ్ ప్రాంతాలు, హరిత హోటల్ వంటివి అందుబాటులోకి వచ్చాయి.
-సత్యనారాయణ, ములుగు ఎమ్మార్వో
పోటెత్తిన భక్తులు
ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క-సారలమ్మ జాతర వైభవం కన్నులపండువగా కొనసాగుతోంది. పెద్దఎత్తున తరలివస్తున్న భక్తజనంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. భక్తుల పుణ్యస్నానాలతో జంపన్న వాగు కళకళలాడుతోంది. భక్తులంతా సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. చాలా మంది తాము మొక్కుకున్నట్లుగా ఎత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పిస్తున్నారు.
ఇదీ చదవండి: మేడారం మహాజాతర.. గిరిజనుల మహా కుంభమేళా..!