Devadula lift irrigation works delay: దేవాదుల ఎత్తిపోతల పథకం పనులు అన్ని దశల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. 38 టీఎంసీల నీటిని ఉమ్మడి వరంగల్, మెదక్, నల్గొండ జిల్లాల రైతాంగానికి అందించాలనే లక్ష్యంతో 2004లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు 17 ఏళ్లయినా అందుబాటులోకి రాలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం దేవాదుల ఎత్తిపోతల సామర్థ్యాన్ని 60 టీఎంసీలకు పెంచి, 6.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలనే లక్ష్యం పెట్టుకొంది. సామర్థ్యం పెంచాలంటే ప్రాజెక్టుకు అనుసంధానంగా కనీసం 10 టీఎంసీల సామర్థ్యంతో స్టోరేజీ జలాశయ నిర్మాణం చేపట్టాలి. ప్రస్తుతం దేవాదుల ప్రాజెక్టు పరిధిలో మొత్తం 18 జలాశయాలు ఉన్నా, అన్నీ కలిపి 8 టీఎంసీల సామర్థ్యం మాత్రమే కలిగి ఉన్నాయి. ఈ క్రమంలో 2018లో ప్రభుత్వం జనగామ జిల్లా చిల్పూరు మండలం లింగంపల్లి వద్ద 10 టీఎంసీల సామర్థ్యంతో దేవాదుల నీటి నిల్వ కోసం ప్రతిపాదించిన జలాశయం నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.3200 కోట్లకు పరిపాలన అనుమతి ఇచ్చింది. అగ్రిమెంట్లు కూడా పూర్తయ్యాయి. దీనికోసం 4400 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉండగా మూడేళ్లు గడుస్తున్నా ముందడుగు పడలేదు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు మొదలు పెట్టవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఎక్కడికక్కడ ఆగిపోయాయి.
పెరుగుతున్న అంచనా వ్యయం...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టును రూ.6 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. పలుమార్లు సవరించిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.13,445 కోట్లకు చేరింది. దేవాదుల ప్రాజెక్టు మొత్తం మూడు దశల్లో 16 ప్యాకేజీలతో నిర్మిస్తుండగా ఇప్పటికి మొదటి దశ మాత్రమే పూర్తయ్యింది. మరో రెండు దశలు మిగిలే ఉన్నాయి. పనుల్లో జాప్యం జరుగుతుండడం వల్ల అంచనా వ్యయం పెరుగుతోంది. 2022 మార్చి కల్లా పనులు పూర్తి కాకపోతే అంచనా వ్యయం మరో రూ.1500 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉన్నట్టు ఇంజినీరింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏడాదిలో 300 రోజుల పాటు ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలంలోని గోదావరి ఇన్‌టెక్ వెల్ నుంచి నీటిని ఎత్తిపోద్దామనే లక్ష్యంతో తూపాకులగూడెం వద్ద సమ్మక్క సాగరం జలాశయాన్ని కూడా నిర్మిస్తున్నారు. బ్యారేజీ పనులతోపాటు, మూడో దశలోని సొరంగం పనులను వచ్చే ఏడాది మార్చికల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్టు దేవాదుల పర్యవేక్షక ఇంజినీరు సుధాకర్‌రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పూర్తయ్యే సరికి కనీసం పది టీఎంసీల నీటి నిల్వ కోసం స్టోరేజీ జలాశయం పనులపై దృష్టిపెడితే ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి జలాశయం పనులు కూడా పూర్తయితేనే దేవాదుల అసలు లక్ష్యం నెరవేరే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: Ramineni Foundation Awards: 'తెలుగోడి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటాలి'