ములుగు జిల్లా గతేడాది కురిసిన అధిక వర్షాలకు తోడు రామప్ప సరస్సు పూర్తిగా నిండటంతో పక్కనే ఉన్న పంటపొలాలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు, వెంకటాపురం మండలాల్లోని పలు గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతి పెద్ద చెరువు రామప్ప.. గతేడాది కురిసిన వర్షాలకు నిండు కుండలా మారింది. దీంతో యాసంగిలో వేసిన పంటలు నీట మునిగాయి.
గతేడాది రామప్ప సరస్సులో నీరు తక్కువగా ఉండటంతో దాదాపు 1500 ఎకరాల్లో రైతలు వరి సాగు చేశారు. వర్షాలకు తోడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వంగపల్లి, గణసముద్రం చెరువులకు గోదావరి నీటిని తరలించేందుకు దేవాదుల పైప్లైన్ ద్వారా సరస్సును నింపారని అన్నదాతలు చెప్పారు. దీంతో రామప్ప పూర్తిగా నిండిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సరస్సుకు నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో ఆక్సిజన్, కొవిడ్ పడకల కొరత లేదు : కిషన్ రెడ్డి