ములుగు జిల్లా తాడ్వాయి మండలం దట్టమైన అటవీ ప్రాంతంలోని రాపట్ల గ్రామానికి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కాలిబాట పట్టారు. కొండలు, కోనలు దాటుతూ సుమారు 4 కిలోమీటర్ల పైన కాలినడకన వెళ్లారు. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతోన్న అడవి బిడ్డలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.
ప్రయాణ సౌకర్యం లేకున్నా..
కరోనా మొదటి దశ లాక్డౌన్లో ఎన్నో సంక్షేమ కార్యక్రామలు చేపట్టిన సీతక్క, రెండో దశలోనూ.. నియోజక వర్గంలోని గిరిజనుల ఆకలి తీరుస్తున్నారు. కనీస అవసరాలకు నోచుకోలేని అడవి బిడ్డలకు.. అన్ని తానై ఆదరిస్తున్నారు. గన్మెన్లు, ప్రయాణ సౌకర్యాలు సరిగా లేకున్నా.. సహచరులతో కలిసి నియోజకవర్గ ప్రజల వద్దకు నడిచి వెళుతున్నారు.
సలాం.. సీతక్క
గిరిజనుల గూడాలకు వెళ్లి.. నిత్యావసరాలతో పాటు దుప్పట్లు, దుస్తులను పంపిణీ చేస్తున్నారు సీతక్క. వారితో కలిసి ముచ్చటిస్తున్నారు. వైరస్ గురించి భయపడవద్దని ధైర్యం చెబుతున్నారు. మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు చేస్తున్నారు. కాలినడకన వెళ్లి నిరుపేదలను అండగా నిలుస్తోన్న సీతక్కను.. ఇప్పుడంతా ప్రశంసిస్తున్నారు. అడవి బిడ్డలను ఓ అమ్మలా ఆదుకుంటోన్న ఎమ్మెల్యేకు.. అంతా సలాం కొడుతున్నారు.
ఇదీ చదవండి: Lockdown: రాష్ట్రంలో పటిష్టంగా కొనసాగుతున్న లాక్‌డౌన్