ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సందర్శించారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోందని, కొవిడ్‌తో చాలామంది రాష్ట్రంలో మృత్యువాత పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేదని ఆయన విమర్శించారు. ఏరియా ఆసుపత్రిలో కనీస వసతులు, వైద్య సిబ్బంది లేక కరోనా బాధితులకు వైద్యం అందని పరిస్థితి ఉందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో ఆసుపత్రుల్లో సిబ్బంది లేక కరోనా రోగులకు వైద్యం అందక ఇబ్బందులకు గురవుతూ ఉంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ముఖ్యమంత్రి ప్రజలకు మంచి వైద్యం అందిస్తున్నామని చెప్పుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో మద్యం షాపులు తెరిచి ఆదాయం పెంచుకోవాలనే ఆలోచన తప్ప.. ప్రజలకు రక్షణ లేదని భట్టి విక్రమార్క విమర్శించారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ములుగు ఏరియా ఆస్పత్రిలో సరైన వైద్యం లేక ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించి కరోనా రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని కోరారు.
ఇవీ చూడండి: 'ఈటీవీ'కి మహేశ్ రజతోత్సవ శుభాకాంక్షలు